హత్యాయత్నం కుట్రను చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా ?

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో టిడిపి పాత్రుందని చంద్రబాబునాయుడు అంగీకరించారా ? సిబిఐ విచారణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జగన్ పై జరిగిన దాడి అంతా డ్రామా అంటూ ఘటన జరిగిన గంటలోపే డిజిపి, మంత్రులు, చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. తనను హత్య చేయించేందుకు టిడిపి కుట్ర చేసిందని జగన్ అండ్ కో ఆరోపిస్తున్నారు. ఘటనపై విచారించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, సిట్ విచారణను వ్యతరేకిస్తు జగన్ హై కోర్టును ఆశ్రయించారు.

 

తనపై జరిగిన హత్యాయత్నం ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని జగన్ హై కోర్టులో వాదిస్తున్నారు. జగన్ పిటీషన్ ను విచారిస్తున్న న్యాయమూర్తి సమాధానం చెప్పాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. 14 రోజుల్లోనే సమాధానం చెప్పాలని స్పష్టంగా చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన విచారణను చూస్తే జగన్ తరపు వాదనతో న్యాయమూర్తి ఏకీభవించినట్లే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. రేపటి రోజున జగన్ డిమాండ్ కు తగ్గట్లుగా సిబిఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. అందుకే హడావుడిగా సిబిఐ విచారణను అడ్డుకుంటూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు అనుమానంగా ఉంది.

అంటే అందరికీ అర్ధమవుతున్నదేమిటంటే జగన్ పై జరిగిన హత్యాయత్నం టిడిపి చేయించిందే అని పరోక్షంగా అంగీకరించినట్లైంది. విచిత్రమేమిటంటే, ఇదే చంద్రబాబు గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు సిబిఐ విచారణను చాలాసార్లే డిమాండ్ చేశారు. అంటే తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగ, అధికారంలో ఉన్నపుడు మరోలాగ వ్యవహరించటం చంద్రబాబుకు మామూలే. ఇదే విషయంపై లాయర్లు మాట్లాడుతూ, చంద్రబాబు లెక్కల్లో అసలు ఆంధ్రప్రదేశ్ అన్నది దేశంలో అంతర్భాగమేనా అన్న అనుమానం వెలుబుచ్చుతున్నారు. లేకపోతే ఏపి అన్నది తన సొంత రాజ్యంగా భావిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు సిబిఐ పై తిరుగుబాటు మొదలుపెట్టింది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సిబిఐని మమత బిజెపి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఎద్దేవా చేయటం అందరికీ గుర్తుంటే ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులెవరు కూడా సిబిఐకి డిప్యుటేషన్ పెట్టుకోవద్దని కూడా సూచించారు. ఇఫుడు చంద్రబాబు కూడా అదే మార్గంలో వెళుతున్నట్లు అనిపిస్తోంది.

 

ఇదంతా చూస్తుంటే చంద్రబాబు తప్పుల మీద తప్పులు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు. నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. తాను చేసిన అవినీతి, తప్పులు ఎక్కడ బయటపడతాయో అన్న భయమే చంద్రబాబులో ఎక్కువగా కనబడుతోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నరో ఎవరికీ అర్ధంకావటం లేదు.  మరి ప్రభుత్వ తాజా నిర్ణయంపై రేపు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.