ఈ అంతా నేనే చేశాను అన్నది బహుశా చంద్రబాబునాయుడుకు ఊతపదం అయిపోయినట్లుంది. ఏది చేసినా తానే చేశానని అంటున్నారు. ఏం జరిగినా తన వల్లే జరిగిందంటారు. మంచి జరిగితే తన వల్లే జరిగిందని క్లైం చేసేసుకుంటున్నారు. అదే ఎక్కడూనా ఎదురుదెబ్బ తగిలితే మాత్రం దాని గురించి ఎక్కడా పొరపాటున కూడా ప్రస్తావించటం లేదు. ఇదంతా ఎందుకంటే, తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తానే మొదలుపెట్టానని చెప్పారు. 2014కు ముందు రాష్ట్రంలో సంక్షేమ పథకాలే లేవట. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు విన్న ఉన్నతాధికారులతో పాటు తమ్ముళ్ళు కూడా విస్తుపోయారు.
గడచిన నాలుగున్నరేళ్ళలో సంక్షేమ పథకాలకు తాను లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు చెప్పారు. తాను అమలు చేస్తున్న పథకాలు దేశం మొత్తానికి ఓ రోల్ మోడల్ గా నిలిచినట్లు తన భుజాన్ని తానే చరుచుకోవటం విచిత్రంగా ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలోను భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ వంటి సంస్ధలే చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను తాను బ్యాలెన్స్ చేసుకుంటు పోవటం వల్లే రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతోందని తన డప్పు తానే కొట్టుకున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో చాలా వరకూ కేంద్రం ఇస్తున్న నిధులతోనే రన్ అవుతున్నాయి. ఇక అభివృద్ధి పథకాలకు కూడా కేంద్రమే నిధులిస్తోంది. సంక్షేమ పథకాలైన పించన్లు, రేషన్, పేదలకు గృహ నిర్మాణాలు, చంద్రన్న బీమా తదితరాలకు కేంద్రమే పెద్ద ఎత్తున నిధులిస్తోంది. కాకపోతే అవన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక అభివృద్ధి పథకాలైన గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం, నీరు చెట్టు, విద్య, వైద్యం లాంటి పథకాలకు కూడా కేంద్రమే నిధులిస్తోంది. పై పథకాల్లో రాష్ట్రం తన వాటాగా ఖర్చుపెడుతున్నది తక్కువనే చెప్పాలి. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న పనులు తక్కువ ప్రచారం మాత్రం ఎక్కువ. గడచిన నాలుగున్నరేళ్ళల్లో తన వ్యక్తిగత ప్రచారానికి చంద్రబాబు సుమారు రూ 95 కోట్లు ఖర్చు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ తానే కట్టానంటారు. సైబరాబాద్ తన సృష్టేనంటారు. ఏమాత్రం సంబంధం లేకపోయినా హైదరాబాద్ లో మెట్రో రైలు నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. సంబంధం లేని వాటిని, ఎప్పటి నుండో జరుగుతున్న సంక్షేమ పథకాలను తానే ప్రారంభించినట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమి ఓటిమి గురించి మాత్రం ఎక్కడా కనీసం ప్రస్తావన తేవటం లేదు. చంద్రబాబు మాటలు వింటుంటే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది.