తగ్గేదేలే: గడప గడపకూ “గ్యారెంటీ”!

ఏది ఏమైనా.. ఎవరు ఏమనుకున్నా.. జనం నవ్వుకున్నా.. కార్యకర్తలు పెదవి విరుస్తున్నా.. నేతలు లైట్ తీసుకున్నా.. ప్రత్యర్థులు ఎద్దేవాచేసినా.. జగన్ ను ఫాలో అవుతున్నారనే విమర్శలు వచ్చినా.. మీడియా సైతం కాపీ క్యాట్ అని కోడై కూసినా… తాను మాత్రం తగ్గేదే లే అంటూ… నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నచందంగా దూసుకుపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వేదికగా జరిగిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో ను ప్రకటించిన సంగతి తెలిసిందే. “భవిష్యత్‌ కు గ్యారంటీ” అనే పేరుతో ఆరు హామీలను చంద్రబాబు ప్రకటించారు. గతంలో లాగా పుస్తకాల మేనిఫెస్టో స్థానంలో.. తాజాగా జగన్ నవరత్నాల స్టైల్లో ఒక సింగిల్ పేజీ ని ఫాలో అయ్యారు. అయితే ఈ “భవిష్యత్‌ కు గ్యారంటీ” స్కీమ్స్‌ పై పెద్ద రాజకీయ దుమారం కొనసాగుతుంది.

అది కర్ణాటక మేనిఫెస్టోను కాపీ కొట్టారని సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమ పథకాలను సైతం నిస్సిగ్గుగా కాపీ కొట్టారని దుయ్యబడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం ఈ మేనిఫెస్టోపై పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు తన ఒరిజినాలిటీని చంపేసుకుని.. పూర్తిగా జగన్ ని ఫాలో అయిపోతున్నారని కామెంట్స్ టీడీపీ అనుకూల వర్గాల్లో సైతం వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మేనిఫెస్టోపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాను ప్రకటించిన తొలివిడత మేనిఫెస్టోపై బాబు “కొత్త”గా ఆలోచించారు. తనకున్న రాజకీయ, పరిపాలనా అనుభవాన్ని రంగరించి ఒక “సరికొత్త” ఆలోచనకు తెరలేపారు. అందులో భాగంగా 150 రోజులపాటు ప్రతీ నియోజకవర్గంలో గడప గడపకు ఈ తొలివిడత మేనిఫెస్టోను తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 10న ప్రారంభించాలని బాబు ఫిక్సయ్యారు. ఈ తొలివిడత మేనిఫెస్టోని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై సుధీర్ఘంగా ఆలోచించారో ఏమో కానీ.. “ప్రతీ ఇంటి గోడమీద ఈ మేనిఫెస్టోను అంటించాలని” కేడర్ కు సూచించనున్నారు!

దీంతో మరోసారి కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు. గడపగడపకూ మన ప్రభుత్వం పథకాన్ని వైఎస్ జగన్ అమలుచేస్తే, మా నమ్మకం నువ్వే జగనన్నా అని గడపగడపకూ స్టిక్కర్స్ అంటిస్తే… ఆ స్టిక్కర్ ల ప్లేస్ లో తాజాగా తమ మేనిఫెస్టోను అంటించాలని బాబు సూచించడం కాపీలకే కాపీ అని ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మకు ఇచ్చే డబ్బులు దండగ అని… అవి ఎన్నికల సమయానికి దాచుకుంటే దేనికైనా పనికొస్తాయని సెటైర్స్ వేస్తున్నారు. జనం ఏమనుకుంటారనే ఇంగితం కూడా లేకుండా… మరి ఇంత బరితెగించి కాపీ కొట్టడం ఏమిటని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అయినా సరే… బాబు మాత్రం తగ్గేదేలే అంటున్నారు!