చంద్రబాబు ఇల్లు ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి వెంకటపాలెం వరకు కరకట్ట లోపలికి నిర్మించిన భవనాలన్నింటికీ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది.
చంద్రబాబునాయుడు ఇంటితో సహా మొత్తం 36 భవనాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది ప్రవాహం శరవేగంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేసినా వరద ప్రవాహం మాత్రం ఆగడం లేదు.
ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 16.2 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు ఉండగా… ఔట్ ఫ్లో మాత్రం 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ఒకవేళ వరద ఎక్కువైతే.. చంద్రబాబు ఇంట్లోకి కూడా వరద నీళ్లు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే… చంద్రబాబు ఇంటిని కూడా అధికారులు ఖాళీ చేయించారు. గత సంవత్సరం కూడా చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు చేరిన సంగతి తెలిసిందే.