చంద్రబాబు “సిద్ధం”… “రా కదలిరా”కు విరామం!

ఆలసించినా ఆశాభంగం.. ఆలస్యం అమృతం విషం అంటూ చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తుంది. ఎవరో వస్తారు.. ఎదో చేస్తారు అని మోసపోయి ఎదురుచూసేవిషయంలో చంద్రబాబు బీజేపీ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారని తెలుస్తుంది. ఈ సమయంలో “రా.. కదలిరా” కార్యక్రమానికి చంద్రబాబు చిన్నపాటి విరామం ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు దృష్టంతా జనసేనతో సీట్ల సర్ధుబాటు, టీడీపీ అభ్యర్థుల ఎంపికపైనే ఉందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాల్సిన సీట్ల విషయంపై ఫైనల్ గా ఒక క్లారిటీకి రావాలని.. ఇంకా నాన్ చుతూ పోతే క్షేత్రస్థాయిలో బంధానికి బీటలు వారుతున్నాయని.. ఫలితంగా మొదటికే మోసం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మండపేట, అరకు సీట్లలో అభ్యర్థులను ప్రకటించినందుకు జరిగిన రాద్ధాంతం చాలని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పుడు చంద్రబాబు ముందు ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయనే అనుకోవాలి. అందులో ఒకటి జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపై ఒక క్లారిటీ. ఇందులో భాగంగా ప్రస్తుతం జనసేనకు 20 నుంచి పాతిక అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలు ఇవ్వాలని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తుంది. అంతకు మించి ఇస్తే… జగన్ కు అధికారం చేజేతులా కట్టబెట్టినట్లు అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తుంది. మరోపక్క జనసేన ఆశలు మాత్రం మరోలా ఉన్నాయి!

కనీసం 50 స్థానాలకు తక్కువ కాకుండా జనసేన ఫోటీ చేయాలని హరిరామ జోగయ్య లాంటి వారు కోరుకుంటున్న నేపథ్యంలో… ఇటీవల రిపల్బ్లిక్ డే నాడు చేసిన ప్రసంగంలో పవన్… మూడోవంతు సీట్లలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అంటే… ఒకటి రెండు సీటు అటు ఇటుగా 60 స్థానాల్లో అన్నమాట. ఈ విషయంలో పవన్ “తగ్గేదేలే” అంటున్నారని తెలుస్తుంది. అంతకంటే తక్కువ స్థానాలకు అంగీకరిస్తే… రాష్ట్రంలోని మొత్తం జనసైనికులను పాతిక సీట్లకు అప్పగించినట్లవుతుందని భావిస్తున్నారని తెలుస్తుంది.

ఇక జనసేనకు సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి వస్తే… నెక్స్ట్ బాబు ముందున్న సమస్య జనసేనకు ఇచ్చిన సీట్లలోని అభ్యర్థులను బుజ్జగించడం. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే అంతమంది నేతలను బాబు బుజ్జగించాల్సి వస్తుంది. అందులో సగంమంది రెబల్స్ గా మారినా పుట్టె మునగడం ఖాయం!! కారణం… జనసేన కూడా టీడీపీ తర్వాత తామే ప్రత్యామ్నాయం అవ్వాలనుకుంటుందో ఏమో కానీ… టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే జనసేన టిక్కెట్లు అడుగుతుంది.

ఈ విషయంలో చంద్రబాబు ఎంత సూక్షంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిదని చెబుతున్నారు. ఇక మూడో సమస్య… వైసీపీ నుంచి వస్తున్న అభ్యర్థుల సర్దుబాటు వల్ల అలుగుతున్న టీడీపీ నేతలు.. ఒకే చోట ఇద్దరిద్దరు పోటీపడుతున్న నేతల అలకలు! ఈ విషయంలో కూడా చంద్రబాబు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా… “రా కదలిరా” కు చిన్న విరామం ఇచ్చిన బాబు… అభ్యర్థుల ఎంపిక కు సిద్ధం అవుతున్నారు. ఇక ఒకేసారి పవన్ తో కలిసి ప్రచారంలోకి దిగుతారని భావించొచ్చు.