ఇందుకు కాదా చంద్రబాబును విమర్శించేది..?

2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బకు చంద్రబాబుకి బ్రెయిన్ లో చిప్ ఏమైనా దెబ్బతిందా అని అంటున్నారు వైసీపీ నేతలు. ఇంత అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను పట్టుకుని ఎందుకు అలా విమర్శిస్తారని పలువురు ఖండించారు. అయితే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు, ఆ విధానం చూసిన తర్వాత.. వైసీపీ నేతల మాటల్లో వాస్తవం ఉన్నట్లుందని లైన్ లోకి వస్తున్నారు.

అవును… 40ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనను విమర్శించేవారికి కొత్త బలాన్ని తెస్తున్నాయని అంటున్నారు. తాజాగా పుంగనూరు ఘటన, ఆయనపై హత్యాయత్నం కేసులపై చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన అడ్డగోలు వాదన అసహ్యంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.

పుంగనూరులో ఈనెల 3న అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు కారణంగానే అల్లర్లు జరిగాయానేది స్పష్టంగా చెబుతున్నారు. ఆ అల్లర్లలో 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. జరిగిన అల్లర్లకు, పోలీసుల గాయాలకు, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టినందుకు చంద్రబాబే బాధ్యుడని.. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్రలో భాగమేనని పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు.

పుంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకు వెళ్ళిపోవాల్సిన చంద్రబాబు.. కావాలని సడెన్‌ గా పుంగనూరు టౌన్లోకి ఎంటరయ్యారు.. అదికూడా అల్లర్లు చేయటానికే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకనే చంద్రబాబు మీద కుట్ర కేసు కూడా నమోదు చేశారు. ఎప్పుడైతే అల్లర్లకు సంబంధించి తనపైన కుట్ర కేసు నమోదు చేశారని తెలిసిందో వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టారు చంద్రబాబు.

ఈ సందర్భంగా తనపై చాలాసార్లు హత్యాయత్నాలు జరిగాయని కొత్త పల్లవి అందుకున్నారు. తనపైన జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు రివర్సులో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడం ఏమిటంటు కొత్త రాగం తీశారు. ఏపీ పోలీసుల విచారణ నుండి బయటపడటం కష్టమని అర్థ‌మైందో ఏమో కానీ… సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలు సీబీఐ కి ఏపీలో ప్రవేశం లేదని, మోడీ సర్కార్ చెప్పినట్లే సీబీఐ వ్యవహరిస్తోందని ఆరోపించిన చంద్రబాబు.. తాజాగా పుంగనూరు ఘటనపైనా, తనపై జరుగుతున్న హత్యాయత్నాలపైనా సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు రెండు నాలుకల ధోరణికి ప్రత్యక్ష నిదర్శనం.

ఇన్ని చెబుతున్న చంద్రబాబు… అసలు పోలీసులకు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చిత్తూరు వెళ్ళాల్సిన తాను పుంగనూరు పట్టణంలోకి ఎందుకు వచ్చారంటే మాత్రం సమాధానం చెప్పటంలేదు. సరికదా… పైగా ఆయన ఎక్కడికి వెళ్లినా పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చి.. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ప్రయాణించాల్సిన చంద్రబాబు… తనిష్టం వచ్చిన చోటకు తాను వెళతాననే అడ్డదిడ్డమైన వాదన వినిపిస్తున్నారు.

అక్కడితో ఆగని చంద్రబాబు… తనదైన అడ్డగోలు వాదనను తెరపైకి తెచ్చారు. తనను హత్య చేయటానికి వైసీపీ గుండాలు ప్రయత్నిస్తే.. కమెండోలే తన ప్రాణాలను కాపాడినట్లు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు అనని మాటలను అన్నట్లు చెప్పుకుని బుడి బుడి దుక్కాలు తీసిన చంద్రబాబు… తనపైన హత్యాయత్నం జరిగితే ఇంతకాలం చెప్పకుండా ఉన్నారా?

వైసీపీ పాలనలో తనపై హత్యాయత్నం జరిగిందని ఎప్పుడూ ఎక్కడా చెప్పని చంద్రబాబు… పోలీసులు సరైన కేసులు పెట్టేసరికి ఈ కొత్త వాదనకు తెరలేపారు. తాజాగా పుంగనూరులో జరిగిన ఘటనలో కూడా చంద్రబాబు వాహనం దగ్గరకు ఎవరూ వెళ్ళలేదు. ఆ విషయం వీడియోల్లో స్పష్టంగా కనబడుతునే ఉంది. చంద్రబాబే మైకులో తన మద్దతుదారులను పోలీసులు, వైసీపీ వాళ్ళమీదకు రెచ్చగొట్టి పంపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఆ విషయం చంద్రబాబుకి తెలియంది కాదు. దీంతో… వీడియోల సాక్ష్యంగా తాను ఎక్కడ దొరికిపోతానో అనే భయంతోనే చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టినట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబుపై పెట్టిన కేసుల పట్ల ఏపీ ప్రభుత్వం సీరియస్ గానే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల రూపంలో వీలైనంత తొందరలో విచారణ పూర్తి చేస్తుందా.. లేక, బాబు ప్యాకేజీలకు జగన్ సైతం లొంగిపోతారా అనేది వేచి చూడాలి!