ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతో కాంగ్రెస్ తో మైత్రిపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించారు. దేశం ప్రమాదంలో ఉందన్న బాబు దేశ ప్రయోజనాల కోసమే బీజేపీయేతర పార్టీలతో కలిసి ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ తో మైత్రి పెట్టుకున్నప్పటికీ…ఆ పార్టీతో ఏపీకి వివాదాలు ఉన్నాయని అనూహ్య వ్యాఖ్యలు చేసారు. మాకు కాంగ్రెస్ తో పాటు బీజేపీతోనూ వివాదాలున్నాయి. కాంగ్రెస్ చేయలేదు. బీజేపీ నమ్మించి మోసం చేసింది అని విమర్శించారు. కాంగ్రెస్ తో మైత్రి ప్రకటించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రెస్ మీట్ లో చంద్రబాబు వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే…
దేశ ఐక్యత కోసం కృషి చేస్తాం. దేశ విస్తృత ప్రయోజనాలే మాకు ముఖ్యం.
దేశ ప్రయోజనాలకంటే టీడీపీకి ఏదీ ముఖ్యం కాదు. దేశాన్ని రక్షించాలని భావిస్తున్న పార్టీలతో కలిసి వెళ్తాము.
దేశం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నదే లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి.
శరద్ పవర్, ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్ తో భేటీ అయ్యాను. జాతీయ నేతల పార్టీల నేతలందర్నీ కలవాలనుకుంటున్నా అని వెల్లడించారు.
మోడీ హయాంలో ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిందన్నారు. మోడీ ప్రభుత్వంలో జనం కష్టపడ్డారు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
డీమానిటైజేషన్ కష్టాలు నేటికీ తీరడం లేదు. మోడీ సర్కార్ తీరుతో జనం విసుగెత్తిపోయారు. జీఎస్టీ దుష్పరిణామాల్ని అనుభవిస్తున్నాం అన్నారు.
అన్ని విభాగాల ఉన్నతాధికారుల పదవులు గుజరాతీలకే దక్కుతున్నాయి. అన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
మా ఎంపీలపై ఐటి దాడులు చేయిస్తున్నారు. బీజేపీ ఏపీకి అన్యాయం చేయడంతోపాటు, ఐటి దాడులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
మీడియాని కూడా నియంత్రించాలని చూస్తున్నారన్నారు. కిందటిసారి నా ప్రెస్ మీట్ ను నేషనల్ మీడియా కవర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
ఐక్యత విగ్రహం ఆవశ్యకత ఏమిటి? రాఫెల్ పై ప్రధాని మోడీ మౌనానికి అర్ధం ఏంటి? బోఫోర్స్ కు లేని రహస్యం రాఫెల్ కు ఎందుకు? అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సంకీర్ణ ధర్మాన్ని మోడీ నాశనం చేసారు. మోడీ కంటే ఏ నాయకుడైనా గొప్పగా పని చేస్తాడు. చరిత్రలో మొదటిసారి ఆర్బీఐ సెక్షన్ 7 అమలు చేస్తున్నారు.
మన దేశంలో ఉన్నంత యువత మరెక్కడా లేరు. మనవాళ్లకు ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం ఉంది.
హైదరాబాద్ తో దేశంలో మరో నగరాన్ని పోల్చడానికి వీల్లేదు. హైదరాబాద్ వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది.
నేను తెలంగాణ సీఎం ను కాదు. తెలంగాణ వ్యవహారాల్లో తల దూర్చను.
ప్రస్తుతం ఉన్నది బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి. ఏ కూటమి వైపు ఉండాలన్నది తేల్చుకోవాల్సింది కేసీఆరే.
బీజేపీ పేరు వింటేనే ఏపీ ప్రజల ఆత్మక్షోభిస్తుంది. ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని జాతీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఏపీ అంశాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
మాకు కాంగ్రెస్ తో పాటు బీజేపీతోనూ వివాదాలున్నాయి. కాంగ్రెస్ చేయలేదు. బీజేపీ నమ్మించి మోసం చేసింది.
తెలుగు ప్రజలు గతాన్ని మరిచిపోయి అభివృద్ధి పధంలో దూసుకెళ్ళాలి అని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తాను అని చంద్రబాబు హామీ ఇచ్చారు.