వాలంటీర్లపై బాబు కీలక వ్యాఖ్యలు… పవన్ తో ఏకీభవించినట్లే?

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు మైకుల ముందుకు వచ్చారు.

గత మూడు నాలుగు రోజులుగా వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్నా చంద్రబాబు ఇప్పటివరకూ స్పందించకపోవడంతో… తలుపు చాటున దాక్కుని జనసేన పతనాన్ని చూస్తున్నారనే కామెంట్లు వినిపించాయి.

అయితే అదేమీ లేదు.. పవన్ ని ఆ దిశగా వదిలింది చంద్రబాబే అని… ఈ సమయంలో వాలంటీర్లపై తాను ఈ స్థాయిలో నోరు పారేసుకోలేము కాబట్టి… పవన్ ని వదిలితేనే కరెక్ట్ అని చంద్రబాబు పక్కా ప్లాన్ తోనే కీ ఇచ్చి వదిలారని అంటున్నారు! ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించారో ఏమో కానీ… పవన్ వ్యాఖ్యలు చేసిన తర్వాత నాలుగో రోజు చంద్రబాబు స్పందించారు.

ఆదివారం రాత్రి ఏలూరు జనసేన సభలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. “వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదు” అని అన్నారు!

“వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదు.. వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరించడం ద్రోహం.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది.. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్ల సేవలు పరిశీలిస్తాం” అని అన్నారు చంద్రబాబు.

దీంతో… తమరు చేసిన వ్యాఖ్యలు తమరికైనా అర్ధమయ్యాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు! మరోపక్క వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో చంద్రబాబు పరోక్షంగా ఏకీభవించినట్లే అని అంటున్నారు! వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదని హెచ్చరించడం అంటే… ఇప్పటికే వారు ఆ పనిలో ఉన్నారని బాబు భావిస్తున్నారా.. లేక, ఇప్పటివరకూ లేరు ఇకపై ఉండొద్దు అని సూచించినట్లా అని ప్రశ్నిస్తున్నారు!

ఇదే సమయంలో… “వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది” అని అంటున్నారంటే… పవన్ చేసిన ఆరోపణలతో చంద్రబాబు ఏకీభవించినట్లే కదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా… తనకున్న రాజకీయ అనుభవంతో… ఏమి చెప్పారో తనకు కూడా అర్ధం కాకుండా చంద్రబాబు స్పందించారని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో బీజేపీతో పొత్తులపై కూడా స్పందించిన చంద్రబాబు… దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమని.. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమని.. మిగతా విషయాలు తర్వాత అని చెప్పుకొచ్చారు. దీంతో… బాబు హాస్యం పీక్స్ అని అంటున్నారు పరిశీలకులు.

2014లో ముఖ్యమంత్రి అయినతర్వాత రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మిగిలినవి అన్నీ పట్టించుకున్నారు కాబట్టే కదా 2019 ఫలితాలు అలా వచ్చాయని గుర్తు చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అటూ ఇటూ కాకుండా చేశారనే కదా అని మరొకరంటున్నారని తెలుస్తుంది.

ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రయోజనాలే తన ముఖ్యమని చంద్రబాబు చెప్పడం హాస్యం కాక మరేమిటని మరికొంతమంది ఎదురు ప్రశ్నిస్తుండటం గమనార్హం!