విజయవాడలో ఆ నలుగురు… బాబుకు సరికొత్త పరీక్ష పెడుతున్నారు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా… బెజవాడ టీడీపీలో సరికొత్త చర్చ తెరపైకి వస్తుంది. ఇప్పటికే కేశినేని నాని సృష్టించిన అలజడితో పార్టీలో బలమైన చీలిక వచ్చిందని చెబుతున్న వేళ.. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. పైగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాన్ చుడు ధోరణి అవలంభిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న వేళ ఇప్పుడు అక్కడ నువ్వా నేనా అనే చర్చ ఇద్దరు బలమైన నేతల మధ్య మొదలైందని చెబుతున్నారు.

విజయవాడ కేంద్రంగా టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయవాడ టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎంపీ కేశినేని నాని జగన్ తో భేటీ అయిపోయారు! ఇదే సమయంలో తన అనుచరులను, తన వర్గం నేతలను కూడా ఫ్యాన్ కిందకు చేర్చారని చెబుతున్నారు. ఇదే సమయంలో… విజయవాడ పశ్చిమ సీటు గురించి టీడీపీ, జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… విజయవాడ సెంట్రల్ కూడా కాకరేపుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం… టీడీపీ నేతలు వంగవీటి రాధా, బోండా ఉమ!

పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్ టిక్కెట్ టీడీపీకే అనే చర్చ జరుగుతున్న వేళ… ఆ టిక్కెట్ తమ నేతకి అంటే తమనేతకి అని అటు వంగవీటి రాధా, ఇటు బోండా ఉమ అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తుంది!! కారణం… ఈ టిక్కెట్ ఈసారి వంగవీటి రాధాకు ఇస్తారని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో రాధ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడ్యాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే… ఈ పోస్టులు ఉమా వర్గమే పెడుతుందని ఆరోపిస్తూ వంగవీటి వర్గం ఫైరవుతుంది.

దీంతో… అభ్యర్థులను ఫైనల్ చేయాల్సిన సమయంలో చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు కాపు సామాజికవర్గంలోకి కీలక నేతలను తమ కూటమిలో చేర్చుకునే పనిలో భాగంగా ముద్రగడను ఆహ్వానిస్తున్నారంటూ కథనాలొస్తున్న వేళ… వంగవీటి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. టిక్కెట్ ఇస్తారా.. హ్యాండ్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.

విజయవాడ సెంట్రల్ పరిస్థితి అలా ఉంటే… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి కూడా చంద్రబాబుకు అగ్నిపరీక్షే అని అంటున్నారు పరిశీలకులు. ఈ టిక్కెట్ తమకే కేటాయించాలని జనసేన కోరుతున్న సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీలోనే ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా… బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ మధ్య ఈ టిక్కెట్ విషయంలో నువ్వా – నేనా అన్నట్లుగానే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీంతో.. చంద్రబాబు ఈ అగ్నిపరీక్షలను ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.