కుటుంబ సారధులట.! చంద్రబాబు కొత్త వ్యూహం.!

గ్రామాల్లో వాలంటీర్లు అటు వైసీపీకీ, ఇటు వైసీపీ ప్రభుత్వానికీ సేవలందిస్తూ.. ప్రభుత్వానికీ, పార్టీకీ, ప్రజలకీ మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాలంటీర్లకు గౌరవ వేతనం దక్కుతోంది. వాలంటీర్లను ఉద్యోగస్తులుగా ప్రభుత్వం చూడటంలేదు. కానీ, అవసరమొచ్చినప్పుడల్లా.. వాలంటీర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులనే చెబుతూ, ఉద్యోగాల కల్పన పేరుతో వారిని లెక్కల్లో వేసేస్తున్నారు.

సరే, వాలంటీర్ వ్యవస్థపై వచ్చే ఆరోపణ వ్యవహారం.. అది మళ్ళీ వేరే చర్చ. వైసీపీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థతో వైసీపీ రాజకీయంగా బలపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ తరఫున ‘కుటుంబ సాధికార సారధులు’ పేరుతో కొత్త వ్యవస్థను చంద్రబాబు తీసుకొస్తున్నారట.

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో పర్యటిస్తున్న చంద్రబాబు, జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ కుటుంబ సాధికార సారధుల వ్యవహారాన్ని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి టీడీపీ అధికారంలో వున్నప్పుడు న్యాయం చేయలేకపోయామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

‘ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నా..’ అంటున్న చంద్రబాబు, ‘ఇకపై పార్టీలో వున్న సెక్షన్ ఇన్‌ఛార్జిలందరినీ కుటుంబ సాధికార సారధులుగా పిలుస్తాం’ అని పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా ఈ కుటుంబ సాధికార సారధులు పనిచేస్తారని చంద్రబాబు చెప్పారు. పైగా, ఈ సాధికార సారధులుగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారట. ప్రతి నియోజకవర్గంలోనూ కుటుంబ సాధికార సారధి విభాగం వుంటుందట.

ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందట. ప్రతి 30 కుటుంబాలకూ ఓ సాధికార సారధిని నియమిస్తారట. అంటే, వాలంటీర్ వ్యవస్థను పోలి ఈ టీడీపీ కొత్త కుటుంబ సాధికార సారధులవ్యవస్థ వుండబోతోందన్నమాట.