గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని తప్పిదాలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడిపోయేలా చేశాయి. వాటిలో ఇచ్చిన హామీలను నెరవేరేకపోవడం ఒకటైతే ఇంకొకరి అభ్యర్థుల ఎంపిక. గత ఎన్నికల్లో టీడీపీ తరపున చాలామంది సీనియర్ నాయకుల వారసులు టికెట్లు పొంది బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. వీరిలో చాలామంది ఎన్నికలకు కొన్ని నెలల ముందో మహా అయితే గట్టిగా ఏడాది ముందో రాజకీయాల్లో యాక్టివ్ అయినవారే. వారి నడవడిక, తత్త్వం ఎలాంటిదో ఓటర్లకు తెలియదు. కేవలం తండ్రులు పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో వారికి టికెట్లు దక్కగలిగాయి. వారసత్వమనే ఒక్క అర్హత మినహా వారికి టికెట్ పొందడానికి పెద్దగా అర్హతలేమీ లేవు. అందుకే జనం ఓడించి మళ్ళీ ఇంటికే పంపారు.
కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్, టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్, జేసీ వారసులు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి, పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్, ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భాను, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి, భూమా వారసులు ఇద్దరూ, అశోక్ గజపతిరాజు కుమార్తె, శ్రీకాకుళంలో గౌతు వారసురాలు గౌతు శిరీష ఇలా చాలామంది వారసులు ఓటమి చెందారు. వీరిలో అనేకమందికి ప్రజాక్షేత్రంలో తిరిగిన కనీస అనుభవం కూడ లేదు. ఎన్టీఆర్ హయాంలో పార్టీలో చేరి పాతుకుపోతున్న సీనియర్ల పిల్లలు కావడం మూలానే వీరికి చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయించి చేతులు కాల్చుకున్నారు. అస్లు చంద్రబాబు నాయుడి వారసుడు లోకేష్ ఓడారంటే పార్టీని వారసత్వం ఏరకంగా దెబ్బతీసిందో భేరీజు వేసుకోవచ్చు.
అయినా బాబుగారికి తత్త్వం బోధపడలేదు. అంత పెద్ద ఓటమి తర్వాత కూడ ఆయన పార్టీలోని కీలక పదవులు కొన్నింటినీ మాలీ వారసుల చేతికే ఇచ్చారు. ఎన్నికల్లో తర్వాత మొహం చాటేసిన చాలామంది వారసులకు పంపకాల్లో పదవులు దొరికేశాయి. మరి అంతవరకూ వారంతా ఎక్కడున్నట్టు, పార్టీ కోసం ఏం పనిచేసినట్టు. పార్టీ శ్రేణులే టికెట్లు అంటే ఇచ్చారు.. మళ్ళీ ఇప్పుడు పదవులు కూడ దారాదత్తం చేస్తున్నారు. యువతను ప్రోత్సహించడం అంటే వారసులను ప్రోత్సహించడమేనా. వారసుల పిల్లలే యువకుల మిగతా వారు ఏమీ కారా అంటూ స్థానిక నేతల వద్ద బాధను వెళ్లగక్కుతున్నారట. ఇదే రీతిలో వారసత్వానికి అవకాశం ఇస్తూ పోతే పార్టీ బలపడటం కాదు కదా వచ్చే ఎన్నికల్లో కూడ చిత్తుగా ఆడాల్సి ఉంటుందని, ఇక మీదటైనా సమర్థులైన నాయకులను గుర్తించి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. వారి మాటల్లోనూ లేకపోలేదు. టీడీపీకి వారసత్వ రాజకీయాలు నూటికి 90 శాతం విఫలమయ్యాయి. కనుక బాబుగారు పార్టీ కుదురుకునేవరకు వాటిని కొద్దిగా పక్కనపెడితే ఉత్తమం.