కర్నూల్ గడ్డ మీద చంద్రబాబు పరువు నిలపుతున్నది ఈమె ఒక్కరే 

Chandrababu Naidu impressed by Kotla Sujathamma dedication 

తెలుగుదేశం రాష్ట్రంలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2019 ఎన్నికల్లో పార్టీ కుదేలయ్యింది.  భవిష్యత్తులో పార్టీ పుంజుకుంటుందో లేదో అనే అయోమయంలో ఉన్నారు కేడర్.  ఇక సారథి చంద్రబాబు నాయుడు సిట్యుయేషన్ మరీ దారుణం.  నాలుగు దశాబ్దాల అనుభవంలో బాబుగారు అనుభవిస్తున్న కష్ట కాలం ఇదే అనుకోవచ్చు.  గత ఎన్నికల్లో ఓటమి ఒక్కటే కాదు కొన్ని జిల్లాలకు జిల్లాలే చంద్రబాబు పాలనకు మాకొద్దన్నట్టు తిరస్కరించడం ఆయన్ను మరింత కిందికి లాగేసింది.  మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో  అయితే పార్టీని వెలివేసినట్టే చూశారు ఓటర్లు.  మొత్తం సీమలో ఉన్న 52 అసెంబ్లీ  స్థానాల్లో  టీడీపీ కేవలం మూడంటే మూడే స్థానాలకు పరిమితమైంది.  కుప్పంలో  చంద్రబాబు నాయుడు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు.  

సీమలో తిరస్కరణకు గురికావడమే టీడీపీని దారుణంగా దెబ్బతీసింది.  కనీసం 20 నుండి 30 శాతం సీట్లు గెలిచి ఉన్నా చంద్రబాబుకు ప్రతిష్ట దక్కి ఉండేది.  ఇక్కడ గనుక బలపడలేకపోతే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావడమనేది కలే  అనుకోవాలి.  అందుకే సీమలో నాయకుల్ని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు.  అయితే ఎన్నికలు ముగిశాక చాలాంటి లీడర్లు సైలెంట్ అయిపోయారు.  కొందరైతే పార్టీని వీడిపోయారు.  ఇంకొందరు సొంత గొడవలతో పార్టీని పట్టించుకోవట్లేదు.  ఇన్నాళ్లు అండగా ఉన్న పెద్ద కుటుంబాలన్నీ ఒక్కసారి డీలా పడిపోవడంతో బాబుగారికి కూడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పాలుపోవట్లేదు.  

Chandrababu Naidu impressed by Kotla Sujathamma dedication

ఇలాంటి కష్టకాలంలోనే ఆయనకు ఒక మహిళా నేత ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఆమె కోట్ల సుజాతమ్మ.  గత ఎన్నికల్లో ఆలూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన ఆమె ఓడిపోయారు.  ఆమె భర్త కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కర్నూల్ పార్లమెంట్ స్థానంలో బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.  కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి రాజకీయంగా చాలా పలుకుబడే ఉంది.  కాంగ్రెస్ పార్టీలో ఉండగా కోట్ల కుటుంబం ఒక వెలుగు వెలిగింది.  రాష్ట్ర రాజకీయాలను శాసించింది.  కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు దఫాలు  కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఆయన వారసులుగా జయసూర్య  ప్రకాష్ రెడ్డి, సుజాతమ్మలు రాజకీయాల్లో ఉన్నారు.  కానీ కాంగ్రెస్ కనుమరుగవడంతో గత ఎన్నికలకు ముందు వారు టీడీపీలోకి రావాల్సి వచ్చింది. 

ఎలక్షన్లలో ఓడిపోయిన చాలామంది పార్టీ మారడమో లేకపోతే సైలెంట్ అయిపోవడమో చేస్తే సుజాతమ్మ మాత్రం ఆలూరులో పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్నారు.  నిత్యం జనంలో ఉంటూ కేడర్లో ధైర్యం నింపుతున్నారు.  గత ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకుని లోపాలను సరిచేసుకుంటున్నారు.  నియోజకవర్గ ఇంఛార్జుగా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు.  ఆమె పనితనం చూసిన బాబుగారు చాలా సంతృప్తిగా ఉన్నారట.  బ్రతిమాలినా పనిచేయని లీడర్ల  మధ్యన బాధ్యత తీసుకుని కష్టపడుతున్న సుజాతమ్మ బాబుగారికి సీమలో పార్టీని బ్రతికించుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నారట.