గత ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో టీడీపీ తునాతునకలైంది. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అనేక చోట్ల పార్టీ పుంజుకోలేదు సరికదా మరింత దీనావస్థకు వెళ్ళిపోతోంది. మాజీ నేతలు, టికెట్ పొంది ఓడిపోయిన అభ్యర్థులు ఎవరికి వారు సొంత ప్రయోజనాలు చూసుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. కొందరు లీడర్లు ఇంఛార్జులుగా ఉంటూనే వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన నియోజకవర్గాల్లో పార్టీ తీరు తెన్నూ లేకుండా పోతోంది. అందుకే సక్రమంగా లేని వారిని తొలగించి సమర్థులకు పగ్గాలు అందించే పనిలో ఉన్నారు చంద్రబాబు.
చంద్రబాబు రిపేర్లు మొదలుపెట్టిన నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా గిద్దలూరు కూడ ఒకటి. ఈ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఇక్కడి ఓటర్లు వరుసగా ఏ పార్టీకీ పట్టం కట్టరు. ఒకసారి ఒకరికి ఛాన్స్ ఇస్తే ఇంకోసారి మరొక పార్టీని గెలిపిస్తుంటారు. అందుకే వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలు ఇక్కడ జెండా ఎగురవేయగలిగాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి అన్నా రాంబాబు గెలుపొందగా టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి ఓటమిపాలయ్యారు. 2014 వైసీపీ నుండి గెలిచిన అశోక్ రెడ్డి టీడీపీలో చేరారు. అదే ఎన్నికల్లో టీడీపీ తరపున ఓడిన అన్నా రాంబాబు వైసీపీలో చేరి ఈసారి ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికలు ముగిసిన నాటి నుండి అశోక్ రెడ్డి పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదట.
అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటూ సొంత పనులు జరిపించుకుంటున్నారే తప్ప పార్టీని బ్రతికించుకునే ప్రయత్నాలేవీ చేయట్లేదట. అందుకే చంద్రబాబు ఆయన స్థానంలో పిడతల సాయి కల్పనకు పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. గిద్దలూరులో పిడతల కుటుంబానికి మంచి పట్టుంది. ఆ కుటుంబం నుండి పలువురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సాయి కల్పన సైతం 2001 ఉప ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో ప్రాధాన్యం లభించని సందర్భంలో కూడ వారు పార్టీని వీడిపోలేదు. వారి క్రమశిక్షణ పట్ల చంద్రబాబుకు నమ్మకం ఉంది. అందుకే నియోజకవర్గ బాధ్యతలను ఆమెకు అప్పగించి పార్టీని బ్రతికించాలని చూస్తున్నారట.