దారి తప్పిన బాటసారి చంద్ర బాబు

(వి శంకరయ్య)

 

ముఖ్య మంత్రి చంద్రబాబు పొద్దుటూరు ధర్మ పోరాట సభలో చేసిన ప్రసంగం తర్వాత ఆయనకు సానుభూతి తెలపక తప్పదు: ఎందుకంటే, ఒకటి, ఎంతో ఉద్రేకం తెచ్చు కొని సభికుల నుండి స్పందనకు పాకులాడినా ఫలితం కనిపించలేదు; రెండు, సర్కారు జిల్లాలో చేయవలసి ప్రసంగం సీమ జిల్లాల్లో చేయడంతో పప్పులో కాలేశారు.
సీమ టిడిపి నేతలు కూడా సీమ ప్రజల మనోభావాలు సీమ ప్రజల అవసరాలు ముఖ్యమంత్రి కి తెలియజేసినట్లు లేదు.
పోలవరం ప్రాజెక్టు ఎపి జీవనాడి అని ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొని పూర్తి చేస్తానని చెప్పారు. బాగానే వుంది. కాని సీను ప్రజలకు జీవనాడి అయిన పోతి రెడ్డి పాడు రెగ్యులేటర్ శ్రీ శైలం కుడి ప్రధాన కాలువ పనులు అరకొరగా ఎందుకు వున్నాయో ముఖ్యమంత్రి చెప్పలేదు. 44 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే విధంగా పనులు పూర్తి చేయడం ముఖ్యమంత్రి జీవిత లక్ష్యం కాదా? పూర్తి స్థాయిలో పనులు జరగ నందున ఈ ఏడు 24 వేల క్యూసెక్కుల కు మించి విడుదల చేయలేక పోయారు కదా. పోలవరం పూర్తి అయనా సీమ కు నీరు వచ్చే విధంగా పనులు పూర్తి కాక పోతే ఏం లాభం.

సీమ ప్రజలకు జీవనాడి అయిన పోతి రెడ్డి పాడు రెగ్యులేటర్ నాలుగు ఏళ్ల నుంచి అసంపూర్తి గా పక్కన బెట్టి వెంటనే సర్కారు జిల్లాలకు నీరు అందించే పోలవరం గురించి పొద్దు టూరు సభలో ముఖ్యమంత్రి గొప్పలకు పోయినందుననే సభికుల నుండి స్పందన లభించలేదు.

 

ఈ సభలో మంత్రి చంద్ర మోహన్ రెడ్డి చాలా గొప్ప ప్రసంగం చేశారు. ఎందుకో తెలుసా? ఆగష్టు 16 వ తేదీ నుండి పోతి రెడ్డి పాడు రెగ్యు లేటర్ మూత పడే వరకు 112 టియంసి నీరు విడుదల చేస్తే సోమశిలకు 49.165 టియంసి ల నీరు తరలించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. సీమకు కేవలం 63 టియంసి లు మాత్రమే దక్కాయి. అయినా సీమ మంత్రులు ప్రేక్షక పాత్ర వహించారు. శ్రీ శైలంలో 859. 90 అడుగుల నీటి మట్టం వుండి నీరు తరలించే అవకాశం వున్నా తలుపులు మూసేశారు.

 

అంతేకాదు. హెచ్ ఎన్ ఎస్ ఎస్ పధకం లో జీడిపల్లి రిజర్వాయర్ వరకు ప్రధాన కాలువ విస్తరణ పనులు గత ఏడాది ప్రారంభం అయనా ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం పట్టిసీమ పై పెట్టిన పెట్టుబడులు ఈ పధకం పై ఎందుకు పెట్ట లేదు? ఈ కాలువ విస్తరణ పనులు పూర్తి అయవుంటే 4 వేల క్యూసెక్కులు తరలించ వచ్చు కదా. ప్రస్తుతం 2363 క్యూసెక్కుల మాత్రమే తరలిస్తున్నారు. ఇచ్చట 12 పంపు లుంటే 7 మాత్రం పని చేస్తున్నాయి. మిగిలిన పంపులు ఎక్కడ.

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్

…. పోతి రెడ్డి పాడు హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ విస్తరణ పనులు సీమ ప్రజలు కోరుకుంటూ వుంటే సీమ గడ్డ కొచ్చి పోలీసు బందోబస్తు మధ్య సర్కారు జిల్లాలో చేయ వలసిన ఉపన్యాసం చేయడ మంటే దారి తప్పిన బాట సారి అని సున్నితంగా చెప్పాలసి వస్తున్నది.

మొరటుగా చెప్పాలంటే ప్రధాని మోడిని శిఖండిగా పెట్టు కొని సీమ ద్రోహులు సభ జరుపుకున్నారని చెప్పాలి. పోతిరెడ్డి పాడు రెగులేటర్ నుండి 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశానని లేదా ఎప్పటి లోపు పూర్తి చేసి సీమ కు పూర్తి స్థాయిలో నీరు అందించ గలనో ముఖ్యమంత్రి పొద్దుటూరు సభలో చెప్పి వుండ వలసినది. అదే విధంగా Hnss కాలువ విస్తరణ గురించి మాట్లాడి వుంటే సభికులు చప్పట్లు కొట్టి వుండేవారు.

విపక్ష నేత జగన్ ను పులివెందులలో నిరోధించేందుకు గండికోటలో 12 టియంసి లు పెట్టానని ముఖ్యమంత్రి చెప్పారు. బాగానే వుంది. మరి కడప జిల్లాలో వామి కొండ సర్వరాయ సాగర్ ఉద్ది మడుగు సంగతేమిటి. 

Hnss రెండవ దశ చిత్తూరు జిల్లాకు ఏలాగూ టిడిపి హయాంలో నీరు వెళ్లే అవకాశం లేదు. అసలు ప్రధాన కాలువ అలైన్ మెంట్ కూడా నిర్ధారణ కాలేదు. జన్మ భూమి కి పంగనామాలు మిగిలాయి.  అందుకే పొద్దు టూరుసభ ముందుగా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

 

(వి  శంకరయ్య రాయలసీమ యాక్టివిస్టు, ఫోన్ నెంబర్ 9848394013)