టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల మీద కోపగించుకున్న దాఖలాలు పెద్దగా కనబడవు. ఎంత పెద్ద సమస్య అయినా శాంతంగానే చెబుతారు. మరీ అవసరమైతే తప్ప హెచ్చరికలు చేయరు. ఆ హెచ్చరికలు కూడ ఒక స్టేట్మెంట్ తరహాలోనే ఉంటాయి తప్ప కోపంతో అరిచినట్టు ఉండవు. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఈ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు తీరును మెచ్చుకుని తీరాల్సిందే. ఇప్పుడు కూడ టీడీపీ నుండి జంప్ కొట్టిన ఎమ్మెల్యేలు ఎన్ని మాటలు అంటున్నా చంద్రబాబు స్పందించట్లేదు. అంతటి స్వీయ నియంత్రణ కలిగిన బాబుగారినే కంట్రోల్ తప్పేలా చేస్తున్నారు కొందరు లీడర్లు. ఎంతలా అంటే ఆ నేతలు ఎదురుపడితే కంట్రోల్ చేయలేరేమో అన్నట్టు ఉందట ఆయన కోపం.
ప్రస్తుతం చంద్రబాబు దృష్టి మొత్తం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల మీదే ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని అది కుదరని పక్షంలో వైసీపీ మెజారిటీని భారీగా దెబ్బతీసి పుంజుకున్నామని చూపించాలనుకుంటున్నారు ఆయన. కానీ నియోజకవర్గంలో చూస్తే పరిస్థితులు మొత్తం ప్రతికూలంగానే ఉన్నాయి. అందుకే అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన ఆయన సర్వ శక్తులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మను రంగంలోకి దింపారు. ఇక లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు నియోజకవరాల్లోని ముఖ్య నేతలను యాక్టివ్ చేయాలని భావించారు. కానీ ఎవ్వరూ ఆయన మాట వినట్లేదట. ఓడిపోయాక అడ్రెస్ లేకుండా పోయిన ఏడు నియోజకవర్గాల నేతలు పట్టుకుందామన్నా చేతికి దొరకట్లేదట.
శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి చేయగల శక్తి ఉండి కూడ పాటే కోసం పనిచేయట్లేదు. ప్రస్తుతం ఆయన మనసు వైసీపీ మీద ఉన్నట్టు తెలుస్తోంది. దీని వెనుక పెద్దిరెడ్డి ఉన్నారని అంటున్నారు. అందుకే సుధీర్ రెడ్డి బాబుగారికి స్పందించట్లేదట. సత్యవేడులో రాజశేఖర్ సైతం సైలెంట్ అయిపోయారు. ఇంకా ఆయన లాక్ డౌన్ మూడ్లోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎంత కదిపినా కదలట్లేదు. గూడూరులో పాసిం సునీల్ ఏదో మొక్కుబడిగా ఉన్నామంటే ఉన్నాం అన్నట్టే ఉంటున్నారు తప్ప యాక్టివ్ స్థాయిలో లేరు. సూళ్లూరుపేట నేత పరసా వెంకటరత్నం కూడ వైసీపీ దూకుడుకు ఎప్పుడో మౌన ముద్ర వేసేసుకున్నారు. వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డిలోని అసంతృప్తిని క్యాష్ చేసుకుని ముందుకు దూకాల్సిన కురుగొండ్ల రామకృష్ణ చూద్దాం చేద్దాం అన్నట్టే ఉంటున్నారు.
ఇక తిరుపతిలో 2014లో గెలిచి, గత ఎన్నికల్లో కూడ టికెట్ పొంది వైసీపీ ధాటికి ఓడిపోయిన సుగుణ అసలు సోదిలో కూడ లేరు. ఆమె పేరు గట్టిగా వినబడి చాలారోజులు అయింది. వీళ్లందరిలోకి సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కరే పార్టీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. ఎన్నిసాలురు పోటీచేసినా ఒక్కసారి కూడ గెలవని ఈయన ఇప్పటికీ నిరుత్సాహపడకుండా పోరాడుతూనే ఉన్నారు. ఈయన ఒక్కరి విషయంలో తప్ప మిగతా అందరి మీద చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారట. ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు పెట్టుకుని జనంలో లేకుండా ఏం చేస్తున్నారని, వెంటనే తనతో సంప్రదించమని కబురు పంపినా స్పందన కరువైందట. జగన్ కంటే వీళ్లే ఆయను ఎక్కువ టెంక్షన్ పెట్టేస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో వీరెవరికీ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని అంటున్నారట బాబుగారు.