ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయింది. చేతిలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని నెట్టుకు రాలేని పరిస్థితులు..కీలక నేతలంతా జారిపోవడం..ఇంకొంత మంది జైళ్లకెళ్లిన రికార్డును సొంతం చేసుకోవడంతో సైకిల్ పార్టీ బాగా ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఉన్నామని..ఉనికిని చాటుకునే ప్రయత్నం తప్ప! అది ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి భారీగా వలసలకు అవకాశం ఉందని ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియా హెచ్చరించింది. కొంత మంది కీలక ఎమ్మెల్యేల పేర్లను కూడా తెరపైకి తీసుకొచ్చింది.
ఆ క్షణం ఎప్పుడైనా రావొచ్చనే సంకేతాల్ని `సాక్షి` సహా పచ్చ పత్రికలు ఇచ్చేసాయి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్ టీడీపీదే..కూర్చొని మాట్లాడుకుందాం..సెటిల్ చేసుకుందాం! వంటి మాటలతో జంపింగ్ కి సిద్దంగా ఉన్న ఎమ్మెల్యేల్ని అలా ఆపుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అమరావతి తరలింపు విషయంలో రైతులు రోడ్డెక్కి తమ గోడు వినిపించుకుంటున్నా…చంద్రబాబు నాయుడు మాత్రం ఇల్లు కదలకుండా హైదరాబాద్ లోనే ఉంటూ జూమ్ లో జామ్ చేయమనడం వంటి సన్నివేశాలపై కొంత మంది బయటకు చెప్పుకోలేకపోయినా లోలోపన మంటెక్కిపోతు న్నారన్నది ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పసుపు ఎమ్మెల్యేలకు ఇది బాగా ఇబ్బందిగా మారిందంటున్నారు.
వైజాగ్ రాజధాని కావడంతో ఉత్తరాంధ్ర అంతా జగన్ వెంటే ఉంది. విశాఖలో స్థానికంగా ఓ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా అందులో ముగ్గురు ఇప్పటికే గంటా శ్రీనివాసరావు దారిలో నడవడానికి సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ఇన్నాళ్లు సైలైంట్ గా ఉన్న ఆ టీడీపీ ఎమ్మెల్యే కూడా కాస్త మెత్తబడినట్లే కనిపిస్తుందని చర్చకొస్తుంది. నలుగురితో నారాయణ..కులంతో గోవిందా అనడమే ఉత్తమం అని భావిస్తున్నాడుట. ఆ మధ్య స్పీకర్ వెనుకాల నిలబడి జై అమరావతి అన్న ఆ ఎమ్మెల్యేనే ఇప్పుడిలా బాణీ మార్చడం చూస్తుంటే ఆర్డర్ మొత్తం మారుతున్నట్లే కనిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే విశాఖ పరిపాలనా రాజధాని గా శంఖు స్థాపన జరిగే రోజునే `జై వైజాగ్` అనడాని తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నట్లు వినిపిస్తోంది. అదే జరిగితే చంద్రబాబు సహా టీడీపీ తలరాత మారిపోవడం ఖాయమే.