తన భార్యని అసెంబ్లీలో వైసీపీ శాసనసభ్యులు అవమానించారంటూ మీడియా ముందు కన్నీరు మున్నీరైన చంద్రబాబు, తన స్నేహితుడి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి.?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, ఆప్తుడని పలు సందర్భాల్లో చంద్రబాబు చెబుతూ వచ్చారు. రాజకీయ వైరం వేరు, స్నేహం వేరని చెబుతుంటారు చంద్రబాబు. మరి, అలాంటప్పుడు, ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి – విజయమ్మ దంపతుల తనయుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది తప్పుడు పుట్టక.. అని చంద్రబాబు ఎలా అనగలిగారు.?
ఈ మధ్య చంద్రబాబు తన మాట మీద అదుపు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్‌లో ప్లాష్ లైట్ కనిపెట్టింది తానేనని చెప్పడం ద్వారా తన మానసిక స్థితిని ఆయన ప్రపంచానికి మరో రకంగా చాటి చెబుతున్నారు.. అది వేరే చర్చ.
కానీ, నాలుగు దశాబ్దాల రాజకీయం చంద్రబాబుకి సంస్కారం నేర్పకపోవడమేంటి.? ప్రజా జీవితంలో వున్నాక, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా.. సరే, వైసీపీ నేతలు ఇంతకన్నా దిగజారారు కదా.? అంటే, అది వేరే చర్చ. అది కూడా సమర్థనీయం కాదు. లోకేష్ పుట్టుక గురించి వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ దిగజారుడుతనమే.
ఈ విషయమై వల్లభనేని వంశీ, మీడియా సాక్షిగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణ కూడా చెప్పారు.. అది మళ్ళీ వేరే చర్చ.
‘తప్పుడు పుట్టక’ అంటే, అర్థమేంటో ఇక్కడ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అదో జుగుప్సకరమైన వ్యవహారం. చంద్రబాబు నోట ఈ మాట ఎలా వచ్చిందసలు.? బహుశా చంద్రబాబు మతి స్థిమితం కోల్పోతున్నట్లున్నారు.. అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.