రెంటికీ చెడ్డ రేవడి… ఇక పవన్ చేతుల్లోనే బాబు భవిష్యత్?

పవన్ కల్యాణ్ సినిమాల్లో ఒక డైలాగ్… “ఎవడి డప్పు వాడు కొట్టండెహే…” అని! పవన్ తన సభల్లో అదే సూత్రాన్ని ఫాలో అవుతూ.. తనను తాను ఒక గొప్ప విప్లవకారుడిలా, ఆదర్శమూర్తిలా, త్యాగశీలిలా చెప్పుకుంటారని అంటుంటారు. ఇక చంద్రబాబు గురించి అయితే చెప్పే పనేలేదు.

సెల్ ఫోన్ నుందు మొదలుపెడితే సత్య నాదెళ్ల వరకూ, పీటీ ఉష నుంచి పీవీ సింధు వరకూ అన్నీ గొప్ప విషయాలకూ కారణం చంద్రబాబే! వాజపేయి పీఎం అయ్యారన్నా.. కలాం ప్రెసిడెంట్ అయ్యారన్న అది బాబు చలవే!! ఆ సంగతి అలా ఉంచితే… ఇంతకాలం జాతీయ రాజకీయాల్లో చక్రాలు గట్రా తిప్పినట్లుగా బాబు చెప్పుకోని సందర్భం లేదన్నా అతిశయోక్తి కాదేమో.

బీజేపీతో పొత్తులు పెట్టుకుంటూనే… గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూడా పొత్తుపెట్టేసుకున్నారు. సిద్ధాంతాలు పాడూ తనకు ఉండవని నొక్కి వక్కానించినంత పనిచేశారు. కాంగ్రెస్ నాయకులతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతు… మోడీపై దుమ్మెత్తి పోశారు. మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా దుమ్ము లేపారు!

మళ్లీ ఈ మధ్యకాలంలో మోడీ ఆలోచనలూ తన ఆలోచనలూ ఒకేలా ఉంటాయని… ఇద్దరి విజన్ ఒకేలా ఉంటుందని చెప్పుకున్నారు. దీంతో రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పి తెలంగాణలో పార్టీని సమాధి చేసుకున్న చంద్రబాబు… రెండు నాలుకల సిద్ధాంతంతో జాతీయ పార్టీల్లో ఎక్కడా స్థానం లేకుండా చేసుకున్నారనే కామెంట్లు వినిపించడం మొదలయ్యాయి.

కారణం… ఇప్పుడు అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో లేవని తెలుస్తుంది. పైగా బాబుతో ప్రయాణం ఏమాత్రం క్షేమం కాదని బాలంగా భావిస్తున్నాయని అంటున్నారు. అందుకు తాజాగా ఉదాహరణ అటు హస్తినలోనూ, ఇటు బెంగళూరులోనూ తెరపైకి వచ్చింది.

అవును… బీజేపీ తమ పాత, కొత్త మిత్రపక్షాలతో కలిసి సుమారు 30 పార్టీలతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి రెండు తెలుగురాష్ట్రాల నుంచి జనసేనకు ఆహ్వానం అందింది. కానీ… చంద్రబాబు ని మాత్రం మోడీ-అమిత్ షా లు పట్టించుకోలేదు. తాను కాంగ్రెస్ మనిషి అని భావించినట్లున్నారు.

ఇదే సమయంలో బెంగళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో సుమారు 24 పార్టీలు సమావేశమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని మట్టికరిపించాలని వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ సందర్భంగా తమ భావజాలంతో ఏకీభవించే పార్టీలన్నిటినీ కాంగ్రెస్ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఈ సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం రాలేదు. బాబు బీజేపీ మనిషి అని కాంగ్రెస్ నేతలు భావించినట్లున్నారు. 2018లో తెలంగాణ ఎన్నికల సమయంలో బాబుతో తిరిగిన ఫోటోలు చింపేసినట్లున్నారు.

దీంతో… జాతీయ స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు ఒంటరి! అయితే ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు కన్ ఫాం అని అంటున్న సమయంలో… ఇప్పుడు బాబు భవిష్యత్తు పవన్ చేతిలో ఉందని అంటున్నారు పరిశీలకులు. ఏదోలా బీజేపీ నేతలని ఒప్పించి… మూడూ పార్టీలు కలిసి పోటీ చేసేలాగా పవన్ ప్రయత్నిస్తే బాబుకు కాస్త ఉపశమనం దొరికే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాకానిపక్షంలో బీజేపీ-జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తే టీడీపీ మూడోస్థానానికే పరిమితం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.