ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారంటే చెయ్యరా.. మీంస్ పెడుతున్నారంటే పెట్టరా.. చంద్రబాబుకు పూర్తిగా మైండ్ చెడిపోయిందని కొడాలి నాని వంటి నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారంటే విమర్శించరా…? ఎవరు ఏమనుకున్నా.. తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానంటూ చెలరేగిపోతున్నారు చంద్రబాబు. జనం వింటున్నారు… ఒకసారి రికార్డులు తిరగేస్తే కార్టూన్ అయిపోతామనే కంగారు అసలు లేదు! అందులో భాగంగా… తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు!
ఖలేజా సినిమాలో మహేష్ బాబు డైలాగ్… “హమ్మామ్మా.. నా వల్ల కాదు భయ్యా.. నేను ఇంటికెళ్లిపోతాను భయ్యా…” అని తాజాగా బాబు చేసిన వ్యాఖ్యలు విన్నవారు అనుకుంటున్నారన్నా అతిశయోక్తి కాదేమో! ఆ స్థాయిలో చంద్రబాబు చెలరేగిపోయారు. తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు… సత్యా నాదెండ్ల.. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందినవారని.. ఆయన తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారని చంద్రబాబు వివరించారు.
అనంతరం ఆ ఫ్లో కంటిన్యూ చేసిన బాబు… సత్య నాదెండ్ల తండ్రి తన దగ్గర పనిచేశారని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని ఆయన… తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన విజన్ ప్రకారం నడుచుకున్నారని చెప్పుకొచ్చారు. దీంతో… రికార్డులు తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఇందులో తెలిసిన విషయం చూస్తే… టీడీపీ కార్యకర్తలు కూడా “ఖలేజా” లో మహేష్ బాబు డైలాగ్ చెప్పకుండా ఉండలేని పరిస్థితి!
“సత్య నాదెళ్ల తండ్రి 1986 – 1988 మధ్య ఏపీలో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు”. దీంతో… సత్య నాదెళ్ల తండ్రి తన ప్రభుత్వంలో పని చేశారన్న బాబు వాదనలు తప్పు!
కాగా, గతంలో కూడా నవ నిర్మాణ దీక్షలో ప్రసంగించిన బాబు… “తన ప్రబోధం కారణంగా సివిల్ సర్వీసెస్ కు బదులుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సత్య నాదెళ్ల ప్రాధాన్యం ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా రికార్డ్ తిరగేసిన నెటిజన్లు… సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరారు.. అంతకు ముందు సన్ మైక్రో సిస్టమ్స్ లో పని చేశారు. చంద్రబాబేమో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. సో.. సత్య నాదెళ్లను ఐటీ రంగం ఎంచుకోమని ప్రేరేపించే అవకాశం చంద్రబాబుకు లేదని తేలిన సంగతి తెలిసిందే!
దీంతో… బాబు గారి కామెడీ ముందు బ్రహ్మానందం వేస్ట్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. “అదే చంద్రబాబు మేజిక్…” అంటూ బాబు ఫోటొలు షేర్ చేస్తున్నారు!