ఆ స్థానాల్లో అభ్యర్థుల మార్పు… చంద్రబాబు మరో అనూహ్య నిర్ణయం!

ఏపీలో కూటమిగా ఏర్పడిన టీడీపీ – బీజేపీ – జనసేనల్లో టిక్కెట్ల పంచాయతీ తేలినా.. అభ్యర్థుల పంచాయతీ మాత్రం ఇప్పట్లో తేలేలా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కొన్ని చోట్ల రెబల్స్ తెరపైకి రావడం అనేది మరో కొత్త సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో మరోసారి మార్పులు చేయబోతున్నారని.. ఆ మేరకు కొన్ని పేర్లు తెరపైకి తెచ్చారని.. కసరత్తులు కంప్లీట్ అవ్వగానే కార్యకాండ జరిపిస్తారని అంటున్నారు!

కూటమిలో భాగంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ 144 స్థానాల్లోనూ రెండు విడతల్లో 138 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు చంద్రబాబు! ఇంక కేవలం ఆరు స్థానాలే బాకీ ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. ఈ సందర్భంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఒక లోక్ సభ స్థానం పేరు కూడా ప్రస్థావనకు వచ్చినట్లు సమాచారం.

ఇందులో భాగంగా… అనంతపురం జిల్లా మడకశిర స్థానానికి తొలుత సునీల్ కుమార్ పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం సునీల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోందని తెలుస్తుంది. దీంతో మధ్యస్తంగా ఈ టిక్కెట్ ను టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు కు కేటాయించే విషయంపై బాబు ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది. అధికారిక ప్రకటనే తరువాయని అంటున్నారు.

ఇక విజయనగరం జిల్లా గజపతినగరం విషయంలోనూ బాబు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే గజపతినగరం అభ్యర్థిగా విజయనగరం జిల్లా గజపతినగరం అభ్యర్థిగా కే శ్రీనివాస్ పేరు మొదటి జాబితాలోనే ప్రకటించారు. అయితే మారుతున్న పరిణామాల నేపథ్యంలో… ఈ సీటుకు కళా వెంకట్రావును బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకట్రావుకి కూడా అనధికారిక సమాచారం వెళ్లినట్లు సమాచారం.

ఇదే క్రమంలో… నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం విషయంలోనూ బాబు పునరాలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా సూళ్లూరుపేట అభ్యర్థి డాక్టర్‌ విజయశ్రీ, తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో… ఒంగోలు నుంచి ఈసారి అతని కుమారుడికి కాకుండా మాగుంట శ్రీనివాసులురెడ్డినే బరిలోకి దించాలని బాబు ఫిక్సయినట్లు తెలుస్తుంది.