‘తెలుగుదేశం పార్టీని ఇలా ఎంత కాలం నడపగలరు.?

బీజేపీలో కలిపేయొచ్చు కదా.?’ అంటూ బీజేపీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో చెబుతోందిట. వినడానికి వింతగానే వున్నా, రాజకీయాల్లో ఇలాంటి ఆసక్తికరమైన ట్విస్టులు చోటు చేసకుంటుంటాయ్.

చంద్రబాబుకి అత్యంత సన్నిహితులనదగ్గ నాయకులు, 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోయిన విషయం విదితమే. తెలంగాణలో అయితే టీడీపీ గుండు సున్నా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ మనుగడ ఎన్నాళ్ళు.? అన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి జనబాహుళ్యంలో.

‘నేనింకా కుర్రాడినే..’ అంటూ తన మనసు వయసు గురించి చెప్పుకుంటుంటారు చంద్రబాబు ఎంతో ఘనంగా. కానీ, వృద్ధాప్యం ఆయన్ని ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ, చంద్రబాబు కష్టపడుతున్నారు పార్టీ కోసం. ఇంకొక్కసారి ‘ముఖ్యమంత్రి చంద్రబాబు’ అనిపించుకోవాలన్నది టీడీపీ అధినేత కోరికగా కనిపిస్తోంది. కానీ, అది సాధ్యపడేలా లేదు.

‘బీజేపీలో టీడీపీని కలిపేస్తే, మీ కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా బావుంటుంది..’ అన్న కోణంలో చంద్రబాబుని ఒప్పించేందుకు చంద్రబాబు సన్నిహితులతోనే బీజేపీ ప్రయత్నిస్తోందిట. కానీ, చంద్రబాబు మాత్రం, రాష్ట్ర రాజకీయాలు వదిలేసి, హస్తిన రాజకీయాల వైపుకు వెళ్ళేందుకు శ్రద్ధ చూపడంలేదు. ఒకప్పుడు పరిస్థితి వేరు. అప్పట్లో చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేంతటి బలం కలిగి వుండేవారు.

ఇప్పుడు సీన్ మారింది.! కానీ, తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకోకుండా వుండాలంటే, చంద్రబాబు ‘హస్తిన బాట’ పట్టక తప్పదేమో.!