ఎల్లో మీడియా హెల్త్ రిపోర్ట్… బాబుకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్సా?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు.. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఆయన బెయిల్ కోసం, అసలు స్కిల్ స్కాం కేసు క్వాష్ కోసం ఆయన తరుపు లాయర్లు న్యాయస్థానాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు జైలుకి వెళ్లి ఇప్పటికి సుమారు 47 రోజులు పూర్తయిన పరిస్థితి. ఈ సమయంలో బాబుకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అంటున్నాయి టీడీపీ శ్రేణులు.

వాస్తవానికి చంద్రబాబు జైలుకి వెళ్లినప్పటినుంచీ ఈ చర్చ నడుస్తూనే ఉంది. దీంతో… ఆయన భోజనం, మందులు ఇంటినుంచే పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో స్నానానికి వేడినీళ్లు లేవని, ట్యాంక్ లో నీళ్లు సరిగా లేవని బాబు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక దోమలతో కుట్టించి డెంగ్యూ తెప్పించి చంపాలని చూస్తున్నారని లోకేష్.. తనదైన విమర్శలు చేశారు. అనంతరం ఒకడుకు ముందుకేసి… చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని కూడా అన్నారు.

ఈ సమయంలో బాబుకు ఎప్పటినుంచో ఉన్న చర్మ సమస్య కాస్త ముదిరిందని వార్తలొచ్చాయి. దీంతో… జైలు అధికారులు స్పందించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులను పిలిపించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో… గదిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయని.. ఫలితంగా బాబుకు స్కిన్ మరింత డ్యామేజ్ అవుతుందని వార్తలొచ్చాయి!

ఈ సమయంలో వైద్యుల సూచనల మేరకు, కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు సెల్ లో టవర్ ఏసీ ఏర్పాటుచేశారు జైలు అధికారులు. అప్పటి నుంచి బాబు కాస్త చల్లగా ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆయన కంటి సమస్య ఒకటి తెరపైకి వచ్చింది. చంద్రబాబు ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని.. మరో కంటికి కూడా చేయాలని.. అందువల్ల బెయిల్ ఇవ్వమని కోర్టులో పిటిషన్ కూడా వేశారు.

ఇలా ఇప్పటివరకూ చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యుల ఆరోపణలే ప్రముఖంగా వినిపించేవి. మరోపక్క… ప్రభుత్వ వైద్యులు ఇచ్చే నివేదికలు, డైలీ హెల్త్ రిపోర్ట్ లు మాత్రం బాబు ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదని చెబుతున్నాయి. ఈ దశలో కొత్తగా ఎల్లో మీడియా ఎంటరైంది. ఓ రిపోర్ట్ బయటపెట్టింది. అదే నిజమైతే.. బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లే లెక్క!

చంద్రబాబు స్కిన్ సమస్యల కారణంగా ఏసీ అనుమతి ఇచ్చింది న్యాయ్స్థానం. అయితే అప్పటినుంచీ బాబు కూల్ గా ఉన్నారని, స్కిన్ కి క్రీములు వాడుతున్నారని అంతా భావించారు. అయితే ఆ దద్దుర్లు తగ్గలేదని, అవి నడుము కింది వరకు వ్యాపించాయని, వెన్ను కింది భాగంలో నొప్పి తదితర సమస్యలతో బాబు బాధపడుతున్నారని ప్రభుత్వ వైద్యుల నివేదికలో ఉన్నట్టు ఎల్లో మీడియా చెబుతోంది.

ఇదే సమయంలో… ఆయనకు కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌, రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ వంటివి చేయాలని.. వైద్యులు సూచించినట్టు ఆ కథనం సారాంశం. దీనికి సంబంధించి చంద్రబాబుకి కూడా వైద్యులు పలు సూచనలు చేశారని చెబుతున్నారు. అంతేకాదు… చంద్రబాబుకి యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే సమస్య కూడా ఉందని అంటున్నారు టీడీపీ నేతలు.

ఇదే సమయంలో శుక్లాల కోసం ఇప్పటికే ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందని.. ఇప్పుడు కుడి కంటికి కూడా ఆపరేషన్ చేయాలని అంటున్నారు. అది కూడా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ లోనే చేయాలంటున్నారు. ఇప్పటి వరకూ దోమలు కుట్టడం, స్నానానికి వేడినీళ్లు లేకపోవడం, దద్దుర్లు, దురదలు.. వంటి చిన్న చిన్న సమస్యలనే చెబుతూ వచ్చిన తమ్ముళ్లు… ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పటల్ లో ఆపరేషన్ టాపిక్ ఎత్తారు.

దీంతో… ఎలాగైనా చంద్రబాబుని బయటకు తేవాలనే ఆతృత టీడీపీ నేతల్లోనూ, ఎల్లో మీడియాలోనూ స్పష్టంగా కనపడుతోందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఆరోగ్యంపై నివేదికలను ఈ రోజు కోర్టుకు సబ్ మిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో… బాబుకు ఆపరేషన్ కోసం బెయిల్ దొరుకుతుందా.. లేక, రాజమండ్రి జనరల్ హాస్పటల్ లో ఆపరేషన్ చేయించి.. ఆ మరుసటిరోజే జైలుకి తీసుకుపోతారా.. లేక, మరో నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి!