పరిటాల ఫ్యామిలీయే ఆదర్శం… ఉత్తరాంధ్రలో కొత్త లొల్లి!

గతకొన్ని రోజులుగా పైకి ఉత్సాహంగా కనిపిస్తున్న చంద్రబాబుకి లోలోపల కొత్త కొత్త అంతర్గత సమస్యలు ఆందోళనకి గురిచేస్తున్నాయట. ఇవన్నీ ఎన్నికల సమయానికి చినికి చినికి గాలివానలుగా మారబోతున్నాయా అనే టెన్షన్ పట్టుకుందంట. దీనికి తాజా కారణం… మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి అని తెలుస్తుంది.

చంద్రబాబుకి ఉత్తరాంధ్రలో కొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు తమ్ముళ్లు. దీనికి కారణం… పైన చెప్పుకున్న ఇద్దరు మాజీ మంత్రులు కం టీడీపీ సీనియర్ నేతలు. ఉత్తరాంధ్రలోని ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందట. ఇద్దరూ పార్టీ పెట్టిన దగ్గర నుండి చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నారు. పైగా ఇద్దరిదీ ఒకే సామాజికవర్గమే. దీనికి తోడు ఇద్దరికీ తమ నియోజకవర్గాలతో పాటు తమ కొప్పుల వెలమ సామాజికవర్గంలో పట్టుంది.

దీంతో రాజకీయాల్లో తమ సీనియారిటీ, పార్టీలోని సిన్సియారిటీ… తమకే కాకుండా తమ వారసులకు కూడా ఏకకాలంలో ఉపయోగపడాలని భావిస్తున్నారంట ఈ ఇద్దరు నేతలు. అందులో భాగంగా… ఇద్దరూ కూడా తమతో పాటు తమ వారసులకు టికెట్లు అడుగుతున్నారట. అసలు వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలే లేవని చంద్రబాబు నాయుడు పైకి చెబుతున్నా… పాదయాత్రలో భాగంగా చినబాబు చేయాల్సినవి చేసుకుంటూ పోతున్న పరిస్థితి. ఇప్పుడు అదే వీరికి బలంగా మారిందని అంటున్నారు.

తాజాగా తన పాదయాత్రలో భాగంగా… రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ కు టికెట్లు ప్రకటించారు లోకేష్. దీంతో… ఆ అంశాన్ని చూపిస్తూ… పరిటాల కుటుంబానికి ఒక న్యాయం.. తమకు ఒక న్యాయమా? అంటూ ఈ ఇద్దరు సీనియర్లు టికెట్ల కోసం బాబుపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారట. తనకు నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇవ్వటంతో పాటు.. తన కొడుకు చింతకాయల విజయ్‌ కు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడుతున్నారట అయ్యన్న.

ఇదే సమయంలో… పెందుర్తిలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతోపాటు అదే మాడుగుల అసెంబ్లీ టికెట్ తన కొడుకు బండారు అప్పలనాయుడుకు ఇవ్వాల్సిందే అని బండారు సత్యనారాయణమూర్తి పట్టుబడుతున్నారట. దీంతో… ఈ సీనియర్ల సమస్య బాబుకు పెద్ద హెడేక్ గా మారిందని గుసగుసలాడుతున్నారంట తమ్ముళ్లు. మరి ఈ సమస్యను బాబు ఎలా పరిష్కరిస్తారు.. సామరస్యంగా పరిష్కరిస్తారా.. లేక, పార్టీకి కొత్త సమస్యలు తెచ్చి పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.