ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు దూకుడు పెంచారు. గత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు మూడేళ్లు హైదరాబాద్ కే పరిమితమైన ఆయన… గత కొన్ని రోజులుగా ఏపీలోనే బిజీగా తిరుగుతున్నారు. ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు రైతులు గుర్తొచ్చారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలిశారు. ఈ సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలపై అంతెత్తున లేస్తున్నారు వైసీపీ నేతలు.
తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు… అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక వార్నింగ్.. జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు. ఈ గ్యాప్ లో… తనను చూసి ప్రభుత్వం భయపడిపోతోందని ఒక డైలాగ్ కూడా వేశారు. ఇంతకీ బాబు ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే… తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయకపోతే 9వ తేదీ నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారట.
ఇక, జగన్ కు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటంటే… రైతుల సమస్యలు తెలుసుకోవటానికి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అందరం కలిసి రైతులకు అండగా ఉందామని. ఇదే క్రమంలో.. ధాన్యం కొనుగోళ్ళల్లో అధికారులకు కూడా తాము సహకరిస్తామని బాబు హామీ ఇచ్చారు. దీంతో… రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటంలో చంద్రబాబు అందించబోయే సహకారం ఏమిటో అర్థకావటంలేదని అంటున్నారు వైసీపీ నేతలు. ధాన్యం అమ్మేది రైతులు, కొనేది ప్రభుత్వం… నడిమధ్యలో చంద్రబాబు సహకారం ఏమిటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… తాను అధికారంలో ఉన్నప్పుడు సకాలంలో ఎప్పుడూ రైతులకు నష్టపరిహారం అందించని చంద్రబాబు… ఇప్పుడు జగన్ కు వార్నింగులిచ్చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే… వర్షాలు పడుతున్నప్పుడు నష్టాల అంచనా వేయటం సాధ్యం కాదు. వర్షాలు తగ్గిన తర్వాత అంచనాలు వేయటం మొదలవుతుంది. అధికారంలో ఎవరున్నా జరిగేదిదే. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఈ విషయం తెలియదా? తెలిసి కూడా కావాలని ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి రైతులను తప్పుదోవపట్టిస్తున్నారా? బాబుకే తెలియాలి!!