ఎన్నికల బహిష్కరణ: చంద్రబాబు యూ-టర్న్ తప్పదా.?

Chandrababu Gearing Up For Another U-Turn

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారైంది పరిస్థితి. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో దెబ్బ తిన్నాక, ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దాంతో, తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు. ‘పార్టీ సహకరించకపోయినా.. స్థానికంగా మాకున్న బలంతో మేం పోటీలో నిలబడతాం.. గెలిచినా, ఓడినా.. అది మా బాధ్యత..’ అని అంటున్నారు కొందరు టీడీపీ నేతలు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో ఎక్కడ చూసినా ఇదే రచ్చ. పార్టీకి నాయకత్వ లోపం వుందనీ, చంద్రబాబు నిర్ణయాలతోనే పార్టీ భ్రష్టుపట్టిపోయిందనీ టీడీపీ నేతలు చెబుతోంటే, వారిని వారించలేక అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. వైసీపీని కాదని టీడీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ, బీజేపీలోకి వెళ్ళాలనుకుని.. టీడీపీతోనే వుండిపోయిన అశోక్ గజపతిరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే, పార్టీ కోసం చాలా త్యాగాలు చేసిన నేతలు, చంద్రబాబు తీరుని ఇప్పుడు అస్సలేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తే.. భవిష్యత్తులో పార్టీ ఉనికి కష్టమన్నది చాలామంది టీడీపీ నేతల వాదన. దాంతో, చినబాబు నారా లోకేష్ రంగంలోకి దిగారు. కింది స్థాయిలో పార్టీ నేతలు బలంగా నిలబడగలిగితే, అలాంటివారు పోటీలో నిలబడొద్దని టీడీపీ చెప్పలేదని ఒక్కొక్కరినీ బుజ్జగించే ప్రయత్నంలో వున్నారట చినబాబు. దాంతో, చంద్రబాబుకీ చినబాబుకీ మధ్య వ్యవహారం తేడా కొట్టిందనే విమర్శ వైసీపీ నుంచి వస్తోంది. మరోపక్క, బీజేపీలో కలిపేయడానికి చంద్రబాబు కుంటి సాకు వెతుక్కున్నారనే వాదనకు కూడా బలం చేకూరుతోంది.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం నుంచి యూ టర్న్ తీసుకోక తప్పేలా లేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రేపే చంద్రబాబు మీడియా ముందుకొచ్చి.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చని అంటున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles