అమరావతి నెత్తిన మరో బాంబు పేల్చిన చంద్రబాబు

chandrababu-detonated-anoth
chandrababu-detonated-anoth
chandrababu

మునిసిపల్ ఎన్నికల్ని ‘మూడు రాజధానులు వర్సెస్ అమరావతి’ అంశానికి రెఫరెండంగా మార్చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. విశాఖ టీడీపీలో గంటా శ్రీనివాసరావు కారణంగా రచ్చ జరుగుతోంటే, ఇటీవల బెజవాడ టీడీపీలో ‘కుల చిచ్చు’ రేగింది. గుంటూరు టీడీపీలో ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతానికైతే టీడీపీ ఎమ్మెల్యేనే. బెజవాడ టీడీపీ విషయానికొస్తే, కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు.. పెద్ద రచ్చ చోటు చేసుకోవడం, దాన్ని ఎలాగైతేనేం చంద్రబాబు చల్లార్చడం తెలిసిన సంగతే. నిజానికి, బెజవాడ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న కేశినేని శ్వేత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకున్నారు తప్ప, ఇందులో చంద్రబాబు గొప్పతనమేమీ లేదన్నది ఇంకో వెర్షన్.

రాష్ట్రంలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్నది బేరీజు వేసుకోకుండా అమరావతి అంశాన్ని రెఫరెండం కిందకు లాగేశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ, కర్నూలుల్లో టీడీపీకి పూర్తిస్థాయిలో ఎదురుగాలి వీస్తోంది. తాజగా బెజవాడలోనూ ఎదురుగాలి షురూ అయ్యింది. గుంటూరు సంగతి సరే సరి. ఈ పరిస్థితుల్లో అమరావతిని రెఫరెండం కిందకు లాగి చంద్రబాబు పెద్ద తప్పే చేసేశారని అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొంది. మునిసిపల్ ఎన్నికలకీ, అమరావతి అంశానికీ లింకేంటి.? అమరావతిలో ఎన్నికలు జరిగితే, అక్కడ రెఫరెండం అనొచ్చు. పైగా, ఇవి స్థానిక ఎన్నికలు. వీటిల్లో ఎప్పుడూ అధికార పార్టీకే అడ్వాంటేజ్ వుంటుంది. అమరావతి విషయంలో విశాఖ వాసులు కదిలి రాలేదు. కర్నూలు వాసులూ అంతే. గుంటూరు, బెజవాడ కూడా అమరావతి వాసుల వెతల్ని పట్టించుకోలేదు. అలాంటప్పుడు ఆయా మునిసిపల్ ఎన్నికల్లో అమరావతి కోసమంటూ టీడీపీకి జనం ఓట్లెలా వేస్తారు.? టీడీపీ ఓడితే రాష్ట్రం ఓడినట్లు, అమరావతి ఓడినట్లు.. అన్న చంద్రబాబు వైఖరే.. రాష్ట్రానికి ఈ దుస్థితిని తెచ్చిపెట్టింది.