చంద్రబాబు చేసిన 3 తప్పులు ఏంటో తెలుసా?

చంద్రబాబునాయుడు తాజా వైఖరి చూసిన వాళ్ళకు ఆయన మూడు తప్పులు చేసినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వేసిన మూడు స్టెప్పులను గమనిస్తే ఎంత గందరగోళంలో ఉన్నారో అర్దమైపోతోంది. ఇంతకీ చంద్రబాబు వేసిన రాంగ్ స్టెప్పులేంటో చూద్దాం. మొదటిదేమో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల హామీని చంద్రబాబు అమలు చేస్తామని ప్రకటించటం. రెండోది జగన్ పై జరిగిన హత్యాయత్నంకు సంబంధించి ప్రధానమంత్రికి నిరసన లేఖ రాయటం. చివరాఖరుగా మూడోది కేంద్రప్రభుత్వం తెస్తున్న ఇబిసి రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించటం.  పై మూడు విషయాల్లో చంద్రబాబు వైఖరి చూసిన తర్వాత ఓటమి భయం బాగా వెంటాడుతున్నట్లే ఉందని అనుమానిస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వితంతు పించన్లు 2 వేల రూపాయలు ఇస్తామని జగన్ ఎప్పుడో ఇచ్చిన హామీని చంద్రబాబు ఇపుడు ప్రకటించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించారంటేనే జనాలకు బిస్కెట్లు వేస్తున్నట్లు అర్ధమైపోతోంది. పెన్షన్లు పెంచటంపై చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ది ఉంటే అధికారంలోకి వచ్చిన ఇంత కాలం ఎందుకు పెంచలేదు ? పించన్ల విషయంలో చంద్రబాబు తాజా ప్రకటన చూస్తుంటే జగన్ కు భయపడే తెలుగుదేశంపార్టీ ప్రకటన చేసినట్లు అనిపిస్తోంది అందరికీ.

ఇక ఇబిసి రిజర్వేషన్ల అంశం తీసుకుందాం. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం ఇబిసి రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు పార్లమెంటులో బిల్లు కూడా పాసయ్యింది. కేంద్రం నిర్ణయం ఎప్పుడైతే వెలుగు చూసిందో వెంటనే మోడి నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. తర్వాత అదే అంశాన్ని రాష్ట్రంలో తాము అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అంటే మోడి నిర్ణయాన్ని తప్పుపట్టిందీ చంద్రబాబే, అదే నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పింది మళ్ళీ చంద్రబాబే. అంటే తాను  ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబుకే అర్ధమవుతున్నట్లు లేదు.

మూడోది ఆఖరుది అయిన జగన్ పై హత్యాయత్నం విచారణ. జగన్ పై జరిగిన హత్యాయత్నం విచారణను ఎన్ఐఏకి అప్పగిస్తూ హై కోర్టు నిర్ణయించింది. హై కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్ఐఏ విచారణను మొదలుపెట్టేసింది కూడా. ఈ దశలో ఎన్ఐఏ విచారణను నిరసిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాయాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటి ? అంటే హత్యాయత్నానికి కుట్రపన్నిన వాళ్ళెవరో ప్రపంచానికి తెలియకూడదని చంద్రబాబు అనుకుంటున్నారా ? హత్య చేసే ఉద్దేశ్యంతోనే జగన్ పై దాడి జరిగిందని జగన్ అండ్ కో అంటుంటే, కాదు అదంతా ఉత్త కోడి కత్తి డ్రామానే చంద్రబాబు అండ్ కో ఎదురుదాడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఉండే సిట్  విచారణ వల్ల దాడి వెనుక ఎవరున్నారో తెలీలేదు. కనీసం ఎన్ఐఏ విచారన ద్వారా అయినా తెలుస్తుంది కదా ? తనపై తానే జగన్ దాడి చేయించుకున్న విషయం విచారణలో తేలితే చంద్రబాబుకే మంచిది కదా ? చంద్రబాబు వైఖరితో జగన్ పై దాడి చేయించింది టిడిపి నేతలే అని చంద్రబాబే ఒప్పేసుకున్నట్లు అనిపిస్తోంది. జగన్ పై జరిగిన హత్యాయత్నానికి టిడిపికి సంబంధం లేకపోతే చంద్రబాబులో అంత ఉలికిపాటు ఎందుకు ? పైగా ప్రధానికి లేఖ రాయటంలో అర్ధమే లేదు. ఆదేశాలిచ్చింది హైకోర్టయితే చంద్రబాబు ప్రధానికి లేఖ ఎందుకు రాసినట్లు ? చంద్రబాబు చేసిన మూడు తప్పుల వల్ల జనాల్లోకి రాంగ్ సిగ్నల్ పోతున్నట్లు అనిపించటం లేదు ?