చంద్రబాబు పరువు తీసిన అనుకూల మీడియా!

ప్రతీ ఆదివారం ఏదో ఒక “కొత్త” విషయం చెప్పాలని పరితపించే టీడీపీ అనుకూల పత్రిక యజమాని తాజాగా మరో పలుకు పలికారు. విచిత్రంగా ఆ పలుకులో చంద్రబాబు పరువు తీసినంత పనిచేశారు. చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని చెప్పుకొచ్చారు. గత్యంతరం లేకే మోడీతో స్నేహ హస్తం చాస్తున్నారని రాసుకొచ్చారు. జగన్ ను ఎదుర్కోవడం కష్టమనే మోడీ చెంత వాలారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ “పలుకు”లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

“రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డితో తలపడుతూనే కేంద్రంలో నరేంద్ర మోడీతో కూడా తలపడే పరిస్థితిలో చంద్రబాబు లేరు. ఈ కారణంగా బీజేపీకి స్నేహ హస్తం చాస్తూ, ప్రతిపక్షాలకు దూరం జరిగారు. జగన్‌ కు కేంద్ర బలం తోడైతే తాను తట్టుకోలేనన్నది చంద్రబాబు అభిప్రాయం కావచ్చును కానీ.. ప్రతిపక్ష రాజకీయాలలో ఆయన కూడా విశ్వసనీయత కోల్పోయారు.” ఇది తాజాగా చంద్రబాబుపై ఆయన అనుకూల మీడియా రాసుకొచ్చిన కథనం. దీంతో… నిత్యం కొమ్ముకాసే ఎల్లో మీడియానే బాబు గాలి తీసేసిందనే కామెంట్లు మొదలైపోయాయి.

2019 ఎన్నికలకు ముందు బీజేపీతో శతృత్వం పెట్టుకుని తప్పుచేస్తే.. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి అదే బీజేపీతో చేతులు కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల మరింత నష్టం అని చంద్రబాబుకు కొంతమంది తమ్ముళ్లు చెబుతున్నారంట. బీజేపీతో పొత్తువల్ల ఏపీలో టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదని హెచ్చరిస్తున్నారంట. అయితే…. “తాను మోడీతో కలవకపోతే – మోడీ వెళ్లి జగన్ తో కలుస్తారు.. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి” అని బాబు వారికి నచ్చచెప్పుతున్నారంట.

అయితే అటు బీజేపీ దగ్గరకానీ, ఇటు జాతీయస్థాయిలోని ప్రతిపక్షలా దగ్గర కానీ చంద్రబాబు విశ్వాసాన్ని కోల్పోయారని ఇలా బహిరంగంగా చెప్పడం మాత్రం… బాబు పరువును నడిరోడ్డుపై తీసినట్లేనని అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి “సవరణ”టైపులో డ్యామేజ్ కంట్రోల్ కథనం మరొకటి వస్తోందా.. లేక, తీరా అచ్చైపోయి బౌన్స్ బ్యాక్ అయ్యింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో తప్పైపోయిందని సైలంట్ గానే ఉంటారా అన్నది వేచి చూడాలి! ఏది ఏమైనా… ఈ అక్షర సత్యాలు టీడీపీ కేడర్ లో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినంత పనిచేసింది!!