ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై ఏపీ సీనియర్ మంత్రులు, ఎజి తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. కోర్టుకు వెళ్లకుండా రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ధర్మాబాద్ కోర్టుకు భారీ ర్యాలీగా వెళ్లాలని కొంతమంది మంత్రులు సూచించారు. అయితే చంద్రబాబు మాత్రం రీకాల్ పిటిషన్ వేసేందుకే మొగ్గు చూపారు. జరిమానా వేస్తే తప్పు చేసినట్టు, తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని పోరాటమే చేస్తేనే బెటర్ అని కొంతమంది సీనియర్ మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చదవండి.
ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై దాదాపు గంటసేపు ఏపీ సీనియర్ మంత్రులు, ఎజి తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ధర్మాబాద్ కోర్టుకు వెళితే ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అనే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వెళ్లకపోతే న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వెళితే పొలిటికల్ గా ఎటువంటి మైలేజ్ వస్తుంది. రాజకీయంగా ఈ అంశంతో ఇరు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో కలిగే లబ్ది ఏమిటి అని చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
కాగా ధర్మాబాద్ కోర్టుకు హాజరు కాకుండా రీకాల్ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయాన్ని ఫైనల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు, అమర్నాధ్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు ధర్మాబాద్ కోర్టుకు వెళితే బావుంటుందని చంద్రబాబు నాయుడు వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. భారీ ర్యాలీతో తెలంగాణ నుండి వెళితే ఉత్తర తెలంగాణాలో మహాకూటమి కొంత గేరప్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రులు సూచించినట్టు తెలుస్తోంది. టీఆరెస్ పార్టీ ఉత్తర తెలంగాణాలో బలంగా ఉన్న నేపథ్యంలో కౌంటర్ ఇచ్చే వేదికగా ఈ అంశాన్ని మలచుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం.
గతంలో ఈ అంశంపై ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళితే వారికి జరిమానా పడింది. ఇప్పుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లినా జరిమానా పడే అవకాశం ఉంది. జరిమానా పడితే అది చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా చెల్లిస్తే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కాబట్టి రీకాల్ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేయాలని సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణ లాంటి వారు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రీకాల్ పిటిషన్ నిర్ణయానికి చంద్రబాబు నాయుడు కూడా మొగ్గు చూపినట్టు సమాచారం.