ఏపికి సింగపూర్ కరెంట్..అవసరం లేకపోయినా !

విదేశాలంటే చంద్రబాబునాయుడుకున్న మోజు అందరికీ తెలిసిందే. అందులోను సింగపూర్ అంటే ఇక చెప్పనే అక్కర్లేదు. రాజధాని అమరావతి నిర్మాణమంటూ ఆ దేశంలోని కంపెనీలకు ఎంత పెద్ద పీట వేస్తున్నది అందరూ చూస్తున్నదే. ఇదంతా దేనికంటే సింగపూర్ కంపెనీల నుండి విద్యుత్ కొనుగోలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అదికూడా అవసరం లేకుండానే సుమా.

కేంద్రం ఎటువంటి సహకారం అందించకుండానే విద్యుత్ రంగంలో ఏపి మిగులు విద్యుత్ సామర్ధ్యాన్ని సాధించిందని స్వయంగా చంద్రబాబే ఎన్నోసార్లు చెప్పారు. మిగులు విద్యుత్ అంటే ఏమిటి ? అవసరానికన్నా ఉత్పత్తి ఎక్కువగా ఉంటే దాన్ని మిగులు ఉత్పత్తి అంటారు. ఉదాహరణకు 100 మెగావాట్ల విద్యుత్ అవసరమైతే 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతోందన్నమాట.

అవసరమైన దానికన్నా ఎక్కువ విద్యుత్తే ఉత్పత్తవుతున్నపుడు ప్రైవేటు సంస్ధల నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి ? బుర్రున్న వాడెవరూ అవసరం లేకపోయినా కొనాలని అనుకోరు. అలాంటిది చంద్రబాబు విద్యుత్ ను బయట నుండి కొనాలని నిర్ణయించారు. అదికూడా సింగపూర్ సంస్ధల నుండి. సరే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి. సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి సంస్ధ సింగపూర్ సంస్ధలతో భాగస్వామ్యం ఉందిలేండి. అంటే ఇక్కడ మూడు విషయాలు గమనించాలి.  

అవసరం లేకపోయినా ప్రైవేటు సంస్ధల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. అదికూడా సింగపూర్ సంస్దల నుండి. అందులోను కాంగ్రెస్ నేత బాగస్వామ్యమున్న సంస్ధ. అంటే మిత్రపక్షానికి చెందిన సంస్ధకు లాభం చేయటం కోసమే జనాల నెత్తిన వందల కోట్ల రూపాయల భారమేస్తున్నారు చంద్రబాబు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. మొదటి పిట్ట సింగపూర్ సంస్ధ. రెండోపిట్ట  మిత్రపక్షమైన కాంగ్రెస్ నేత సంస్ధ. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసమా ? లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసమా ? అన్నది తేలాలి. అదికూడా ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో ఏప్రిల్ నుండి కొనుగోళ్ళు ఆరంభమవుతాయట.