తడబడుతున్న బాబు… ప్రశ్నల్లో లాజిక్ శూన్యం!

చంద్రబాబు మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేస్తే.. టీడీపీ నేతలు హైకోర్టులో కేసువేసి స్టే తెచ్చుకోవడం.. దాంతో సిట్ విచారణ ఆగిపోవడం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. సిట్ తన పని తాను చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది! ఆ సంగతి అలాఉంటే… ఈ సుప్రీం తీర్పు అనంతరం మీడియా ముందుకొచ్చిన బాబులో తడబాటు స్పష్టంగా కనిపించిందని.. ఫలితంగా లాజిక్ లేని ప్రశ్నలు సందిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసుకోమని జగన్‌ కు చాలెంజ్ విసిరారు. నిజంగా తాను అవినీతికి పాల్పడినట్లు జగన్ దగ్గర ఆధారాలుంటే తనను వదిలిపెట్టేవాడేనా? అంటు ప్రశ్నించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… అనంతరం… తన మీద ఆరోపణలు చేయటం తప్ప నాలుగేళ్ళు ఏమి చేశారు? అని ప్రశ్నించారు చంద్రబాబు. దీంతో… ఈ ప్రశ్నలో లాజిక్ శూన్యం అన్న విషయం బాబు గ్రహించలేనంత తడబాటులో ఉన్నారనే కామెంట్లు మొదలైపోయాయి.

అవును… గడిచిన నాలుగేళ్లుగా తనపై ఆరోపణలు చేయడం మినహా ఏమి చేయగలిగారని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. విచిత్రం ఏమిటంటే… బాబు ఈ విషయంపై ఎప్పటికప్పుడు స్టే లు తెచ్చుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఆ విషయం ప్రజలకు తెలియదులే అనే నమ్మకమో ఏమో కానీ… పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు!

తనపై ఎవరు విచారణకు ఆదేశించినా చంద్రబాబు వెంటనే కోర్టులో స్టే తెచ్చేసుకుంటారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణకు నోటీసులు ఇవ్వగానే.. హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు చంద్రబాబు. అనంతరం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమరావతి భూకుంభకోణంపై విచారణకు ఆదేశిస్తే వెంటనే స్టే తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో… స్కిల్ డెవలప్‌ మెంట్ సెంటర్ అవినీతిపై విచారణ అనగానే మళ్లీ స్టే తెచ్చేసుకున్నారు.

తాను నిజంగా ఎలాంటి అవినీతీ చేయకపోతే.. ఎలాంటి అక్రమాలకూ పాల్పడకపోతే… చంద్రబాబు ఇన్నేసి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నట్లు. అసలు బాధ్యత కలిగిన రాజకీయనాయకుడిగా… విచారణకు సహకరించాల్సిన ఆయన స్టే ల మాటున ఎందుకు బ్రతుకుతున్నారు. పైకి ఛాలెంజ్ లు చేస్తుంటారు. అంటే… చాలెంజ్‌ లు చేసేదీ చంద్రబాబే.. వెంటనే స్టేలు తెచ్చుకునేదీ చంద్రబాబే అన్నమాట!

ఈ సమయంలో… తన అరెస్టు తప్పదనే టెన్షన్ చంద్రబాబు మొహంలో స్పష్టంగా కనబడుతోందనే విశ్లేషణలు బలంగా మొదలైపోయాయి. ఈమేరకు తన అవినీతిపై జగన్ సర్కార్ దగ్గరున్న సమాచారంపై.. చంద్రబాబుకి కూడా సమాచారం ఉందని సమాచారం! అయితే ఈ సిట్ దర్యాప్తు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపబోతుందనేది వేచి చూడాలి!