ఆరునెలల సావాసం… పవన్ లా మారిన చంద్రబాబు!

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత! ఇది అచ్చుగుద్దినట్లు చంద్రబాబుకి సరిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అధికారికంగా పొత్తు లేకపోయినా అనధికారిక మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ టీడీపీ కంటిన్యూ అవుతోందనేది రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారెవరికైనా అర్ధమవుతుందని అంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా పవన్ లా మారిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు.

అవును… సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా చెప్పబడే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ లాగే మాట్లాడేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణమైంది.. వైజాగ్‌ లో ఆగస్టు 15న చంద్రబాబు విజన్-2047 డాక్యుమెంటును రిలీజ్ చేసినప్పటి సందర్భం.

వివరాళ్లోకి వెళ్తే… పవన్ కల్యాణ్ రోడ్డుషోల్లో పాల్గొన్నా, సభల్లో పాల్గొన్నా.. ఆ పార్టీ కార్యకర్తలు “సీఎం సీఎం” అని అరుస్తుంటారు. ఈ విషయాలపై పవన్ పలుసార్లు చికాకుతో కూడిన మాటలు పలికిన సంగతి తెలిసిందే. తాను కనిపిస్తే సీఎం సీఎం అని అరుస్తారు.. ఓట్లు మాత్రం వైసీపీకే వేస్తారు అని ఎన్నిసార్లు నిష్టూరంగా మాట్లాడారు పవన్.

రోడ్ షోలో పాల్గొన్న వాళ్ళంతా తనకు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకంలేదని కాకినాడ రోడ్ షోలో పవన్ డైరెక్టుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తాజాగా వైజాగ్ లో కూడా.. మీటింగ్ కు వచ్చినవారంతా ఓట్లు వేస్తే లెక్క మరోలా ఉంటుందని చెప్పుకొచ్చారు. పరోక్షంగా తన గతానుభవాల తాలూకు నిష్టూరాన్ని బహిరంగపరిచారు.

అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు కూడా తాజాగా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ… తన నిష్టూరాన్ని బయట పెట్టారు. ఇందులో భాగంగా… తన సభలకు జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారు కానీ.. ఓట్లు వేయడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

దీంతో… తమ మీటింగులకు వచ్చేవాళ్ళు కూడా తమకు ఓట్లేయటంలేదని పవన్, చంద్రబాబులు ఇలా బహిరంగంగా చెబితే ప్రత్యర్థుల ముందు ఎంత పలుచనైపోతామో అనే విషయాన్ని వీళ్ళు ఆలోచించటంలేదని అంటున్నారు పరిశీలకులు. ఎదుటి వాళ్ళు తమకు ఓట్లేయలేదన్న విషయం తెలిసినా, పది మందిలో ఆ విషయాన్ని ప్రస్తావించకూడదనే విషయం వీరు మరిచిపోయారా అని అంటున్నారు.

దీంతో… కోపమో, నిక్రోషమో తెలియదు కానీ ఇలా బహిరంగంగా నిష్టూరంగా మాట్లాడటం వల్ల మరింతగా ప్రజల్లో పలుచన అయిపోవడమే కాకుండా… కార్యకర్తల్లో మరింత నిరాసక్తి నిండిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నిష్టూరం ఉంటే పర్సనల్ గా కలిసి నప్పుడు ఇద్దరూ కలిసి మాట్లాడుకుని, ఒకరినొకరు ఓదార్చు కోవాలే కానీ… ఇలా చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.