చంద్రబాబు కోరికని ఏపీ సీఐడీ మన్నించింది. ఎలాగైనా అరెస్టవ్వాల్సిందే.. అని గట్టిగా పట్టుబట్టిన చంద్రబాబుని, ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. నిజమేనా.? చంద్రబాబు కోరికని తీర్చడానికే ఏపీ సీఐడీ ఆయన్ని అరెస్టు చేసిందా.? అలా అనడం సబబు కాదుగానీ.. ‘దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి’ అంటూ గత నాలుగున్నరేళ్ళుగా పదే పదే వేదికల మీదకెక్కి నానా యాగీ చేస్తున్న చంద్రబాబు చివరికి అరెస్టయ్యారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబుని అరెస్టు చేశారు. రాజకీయ అరెస్టులకు ముందు హైడ్రామా మామూలే. అది ఇక్కడా జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లను ఏపీ సీఐడీ పేర్కొంది. దాంతో, చంద్రబాబు జైలుకు వెళ్ళక తప్పేలా లేదు.
మరోపక్క చంద్రబాబు లీగల్ టీమ్, ఆయన జైలుకు వెల్ళకుండా వుండేందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, అరెస్టు చేశారంటూ చంద్రబాబు గుస్సా అయ్యారు అరెస్టు సమయంలో. తన పేరు ఎఫ్ఐఆర్‌లో లేకుండా అరెస్టు చేయడమేంటన్నది చంద్రబాబు ప్రశ్న.
అన్ని విషయాలూ కోర్టుకు విన్నవిస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. చంద్రబాబుని నంద్యాల నుంచి విజయవాడకు ఏపీ సీఐడీ తరలిస్తోంది. పోలీసు వాహనంలో కాకుండా, తన సొంత వాహనంలో.. చంద్రబాబు, నంద్యాల నుంచి విజయవాడకు బయల్దేరారు. మరోపక్క, టీడీపీ ముఖ్య నేతలు ఏపీ వ్యాప్తంగా హౌస్ అరెస్టు అవుతున్నారు.
యువగళం పాదయాత్రలో వున్న నారా లోకేష్, తన తండ్రిని కలిసేందుకు విజయవాడకు వెళ్ళే ప్రయత్నంలో వుండగా, ఆయన్నీ పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు, నారా లోకేష్‌ని వారించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట.. అనే పేరున్న చంద్రబాబు, విజయవాడ చేరుకునే లోపు బెయిల్ తెచ్చుకుంటారా.? తెచ్చుకోగలిగితే, ఏపీ సీఐడీ అరెస్టు.. అభాసుపాలవడం ఖాయం.!