వెంకీ సినిమాలోని ట్రైన్ ఏపీసోడ్ మాగ్జిమం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఎపిసోడ్ లోని ఒక సన్నివేశంలో బ్రహ్మానందం.. రవితేజపైకి ఎగిరెగిరి పడుతుంటాడు. ఏమిటి కొడతా.. నన్ను కొడతావా.. అంటూ మీద మీదకు వెళ్లి రెచ్చ గొడతాడు.. దమ్ముంటే కొట్టు అన్నట్లుగా కవ్విస్తుంటాడు. అనంతరం రవితేజ… చెంప చెల్లుమనిపించేసరికి… “కన్ ఫాం.. నేను వస్తా సర్” అని వెనక్కి వెళ్లిపోడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… ఏపీలో టీడీపీ నేతలు కూడా జగన్ పై ఆ టైపులోనే ఎగురుతున్నారు!
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేసేందుకు సుప్రీం అనుమతి ఇవ్వడంతో… చంద్రబాబు అరెస్ట్ అంశం తెరపైకి వచ్చింది! ఈ మేరకు వైసీపీ నేతలు కూడా పరోక్షంగా ఈ విషయంపై హింట్స్ ఇస్తున్నారు. సిట్ విచారణ మొదలైన తర్వాత.. రెండు మూడు రోజుల వ్యవధిలోనే అరెస్టులు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో… వైఎస్ జగన్ పై ఎగిరెగిరి పడుతున్నారు టీడీపీ నేతలు.
నిజంగా చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని నమ్మి అంటున్నారో.. లేక, బాబుపై గతంలో వారికి ఏమైనా కక్షలున్నాయో తెలియదు కానీ… “ధమ్ముంటే చంద్రబాబుని అరెస్ట్ చేయండి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ విషయంలో మైకందుకున్న గంటా శ్రీనివాస్… “టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేయగలరా” అని వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. అక్కడితో ఆగని ఆయన… “బాబుని అరెస్ట్ చేయడం సాధ్యమేనా” అని ప్రశ్నిస్తున్నారు.
దీంతో… గంటాకు చంద్రబాబుపై ఏదో పాత పగ ఉన్నట్లుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. గంటా పొలిటికల్ గా రీ యాక్టివ్ అయ్యారు.. సంతోషం. రోజూ ప్రెస్ మీట్ పెడుతున్నారు.. మరీ సంతోషం. కానీ మధ్య మధ్యలో… “బాబుని అరెస్ట్ చేసుకోండి చూద్దాం” అని జగన్ కు సవాళ్ విసరడం ఎందుకు.. ప్రతీసారీ బాబు అరెస్టు అంశాన్ని తెరపైకి తెచ్చి తమ్ముళ్లను టెన్షన్ పెట్టడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు! ప్రభుత్వ పెద్దలు దీన్ని సీరియస్ గా తీసుకుంటే జరిగేది సంచలనమే అని హెచ్చరిస్తున్నారు.
మరి గంటా కోరుకుంటున్నట్లుగానో, సవాళ్ చేస్తున్నట్లుగానో, వైసీపీ మంత్రులు చెబుతున్నట్లుగానో… సిట్ విచారణ సీరియస్ గా జరుగుతుందా… గత ప్రభుత్వ పాలనలో అవినీతికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకుంటుందా… ప్రజల సొమ్మును కాపాడుతుందా అనేది వేచి చూడాలి! అంతా “సిట్” మహిమ అన్నమాట!