ఒత్తిడికి లొంగిన చంద్రబాబు, జగన్

అవును తమపై పెరిగిపోయిన ఒకేరకమైన ఒత్తిడికి చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి లొంగిపోయారు. ఏ విషయంలో అయినా ఇద్దరి ఆలోచనలు, కార్యాచరణ వేర్వేరుగా ఉంటున్నా ఈ విషయంలో మాత్రం ఇద్దరు ఒకే రీతిగా ఆలోచించటం విశేషంగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా ? అయితే ఈ కథనం చదవాల్సిందే.  విషయం ఏమీ లేదులేండి  అభ్యర్ధుల ప్రకటనకు సంబంధించే. అభ్యర్ధుల ప్రకటనను వాయిదా వేసుకున్నారట ఇద్దరు అదినేతలు. తెలంగాణా ఎన్నికల్లో దాదాపు రెండు నెలల ముందే కెసియార్ టిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే కదా ? నిజానికి అంత ముందుగా ఏ పార్టీ కూడా అభ్యర్ధుల జాబితాను ప్రకటించరు. కానీ కెసియార్ జాబితాను ముందుగా ప్రకటించటంతో పాటు దానివల్ల బాగా లబ్డి పొందారు కూడా.

ఏపి ఎన్నికల్లో కూడా చంద్రబాబు, జగన్ అదే పద్దతిని ఫాలో అవ్వాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే అభ్యర్ధులను ఫైనల్ చేయటంపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. చంద్రబాబు అయితే ఒకటికి పదిసార్లు సర్వేలు చేయించుకుంటున్నారు. మొన్నటి వరకూ పాదయాత్రలోనే ఉన్న జగన్ ఎక్కడికక్కడ అభ్యర్ధుల విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అంటే దారులు వేరైనా ఇద్దరూ అభ్యర్ధుల ఎంపికపై సీరియస్ గా నే ఉన్నారు. అందులో భాగంగానే జనవరి మూడోవారంలో అభ్యర్ధుల ప్రకటన జరుగుతుందన్న ఫీలర్లు కూడా వదిలారు.

ఇక్కడే రెండు పార్టీల్లోను కథ అడ్డం తిరిగిందట. అభ్యర్ధుల ప్రకటనకు నేతలు, అభ్యర్ధులు అడ్డంపడ్డారట. రెండు నెలలు ముందుగా జాబితాను ప్రకటిస్తే ఆ ఖర్చులను తాము భరించే స్ధితిలో లేమని చెప్పేశారట. రేపటి ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ దగ్గర నుండి లక్షల రూపాయలు ఏదో ఓ కారణంతో లాగేస్తారని భయపడుతున్నారట. టిక్కెట్లు ఇచ్చిన దగ్గర నుండి ప్రతీ అభ్యర్ధికి సగటున రూ 10 లక్షలు ఖర్చవుతుందని, అంత ఖర్చును తాము ఇప్పటి నుండే భరించే స్దితిలో లేమని నేతలు స్పష్టం చేశారట. నియోజకవర్గంలో జరిగే పెళ్ళిళ్ళు, పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు మెటీరియల్ సప్లై, కార్యాలయాల నిర్వహణ, దేవాలయాల నిర్మాణాలు, విగ్రహాల ఏర్పాటుకు చందాలు ఇలా ఏదో ఓ రూపంలో తమ దగ్గరకు వచ్చే వారికి డబ్బులు సర్దుబాటు చేయాలని నేతలు చెప్పారట.

ఏ కారణంతో తమ దగ్గరకు వచ్చిన వాళ్ళడిగిన డబ్బులు తాము సర్దుబాటు చేయలేకపోతే రాబోయే ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం పడుతుందని భయపడుతున్నారట. దానికితోడు రాష్ట్రంలో రాజకీయం కూడా అయోమయంలో ఉంది. ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే విషయంలో స్పష్టత రాలేదు. వైసిపి ఒంటరిగానే వెళుతుందని జగన్ స్పష్టం చేశారు. అయితే, టిడిపి, కాంగ్రెస్, జనసేన విషయంలో అయోమయం కనిపిస్తోంది. కాబట్టి ఇంత అయోమయం నేపధ్యంలో ఇంతముందుగా క్యాండేట్లను ప్రకటనకు నేతలు అభ్యంతరం చెప్పటంతో ఇద్దరు అధినేతలు సానుకూలంగా స్పందిచారని పార్టీల్లో చర్చ జరుగుతోంది.