గెలుపు అనివార్యం అయిన నేపథ్యంలో టీడీపీ అధినేత తెలిసో తెలియకో.. జనాలకు ఆలోచించేటంత జ్ఞానం లేదనుకుంటారో ఏమో కానీ… తాజాగా రాయలసీమ వెనుకబాటుకు గల కారణాలను విశ్లేషించారు చంద్రబాబు. తన సీనియారిటీని చిన్న చూపు చూస్తున్నారు. పరోక్షంగా తన ఫెయిల్యూర్ ని పబ్లిక్ గా ఒప్పుకునే పనికి పూనుకుంటున్నారు.
చంద్రబాబుకు ఒక వరం ఉందని అంటుంటారు పరిశీలకులు. తాను ఏమి మాట్లాడినా జనం వింటారు.. ఒక వర్గం మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తుంది.. ఏదైనా మిస్టేక్స్ మాట్లాడితే వాటిని హైడ్ చేస్తోంది.. అవసరమైతే వాటికి ఇన్టర్ ప్రిటేషన్ చేస్తూ కొత్త కలర్ ఇస్తోందనే నమ్మకం బాబుకి మాత్రమే ఉంటుందని అంటుంటారు.
ఈ క్రమంలో ఇప్పటికే దేశంలో టమాటా ధరలు పెరగడానికి జగనే కారణం అని తనదైన విశ్లేషణ చేసిన చంద్రబాబు.. తాజాగా రాయలసీమ వెనుకబడటానికి వైఎస్ జగనే కారణం అని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు… అజ్ఞానం, మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. సీమకు తీరని ద్రోహం చేసిన పాపం జగన్ దే అని అన్నారు.
దీంతో చంద్రబాబుపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు పరిశీలకులు. అవును… జగన్ వల్ల సీమకు తీరని అన్యాయం, ద్రోహం జరుగుతుందని.. పరోక్షంగా సీమ వెనుకబాటుకు జగనే కారణం అని చెబుతున్నారు చంద్రబాబు. దీంతో… జగన్ రాక ముందు సీమ అద్భుతంగా ఉందని చెప్పడం చంద్రబాబు ఉద్దేశ్యమా అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు.
తాజాగా హెరిటేజ్ వల్ల చిత్తూర్ డైరీని నాశనం చేసి పాడిరైతుల పొట్టకొట్టిన చంద్రబాబు… ఇప్పుడు జగన్ వల్ల సీమ నష్టపోయిందని అంటున్నారు. చంద్రబాబు సీమ నుంచి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కుప్పం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ కుప్పంలో కనీసం మంచినీటి సదుపాయం కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు.
అలాంటి చంద్రబాబు… ఫస్ట్ టైం సీఎం అయిన జగన్ వల్ల సీమకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని.. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి పోస్ట్ కోసం ప్రయత్నించడం లేదని గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు. దీంతో పరోక్షంగా తాను ఇంతకాలం సీమకు ఏమీ చేయలేదని.. తనతో పాటు జగన్ కూడా చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
దీనివల్ల మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు ఏమి చేశారో గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేస్తూన్నారు. కనీసం కుప్పం నియోజకవర్గానికి ఏమి చేశారనే విషయంలో అయినా చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారంట వైసీపీ నేతలు. మరి చంద్రబాబు ఈ చర్చకు వస్తారా.. లేక, బురదజల్లేసి సైడై పోతారా అనేది వేచి చూడాలి.
ఏది ఏమైనా… తన ఫెయిల్యూర్ ని పరోక్షంగా ఒప్పుకుంటూనే చంద్రబాబు గతకొన్ని రోజులుగా మీడియా ముందు మాట్లాడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో చంద్రబాబు మరింత జాగ్రత్తగా విమర్శలు చేయాలని… ఆలాకానిపక్షంలో తన బండారం తానే బయటపెట్టుకున్నట్లు అవుతుందని.. ఫలితంగా మొదటికే మోసం వస్తోందని సూచిస్తున్నారంట.