బాబుకు ఆప్షన్ లేదు… పవన్ తో “పవర్ షేరింగ్” కు ఒప్పుకుంటారంట!

కాలం గాలం వేస్తే సముద్రంలో ఫిష్.. కాకా హోటల్ లో డిష్ అవుతుందని అంటుంటారు. సరే ఆ సామెత సూట్ కాకపొతే… కాలం గాలం వేస్తే… ఓడలు బళ్లు – బళ్లు ఓడలు అవుతుంటాయి అంటారు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఒక ఘట్టానికి ఇది మాత్రం కరెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.

కొన్ని రోజుల క్రితం వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జనసైనికులు సైతం తీవ్ర విమర్శలు చేశారు. తాను సీఎం పదవికి అర్హుడిని కాదు.. కాకపోతే రాజకీయాల్లో కీలకంగా ఉందా అని చెప్పుకొచ్చారు. పైగా దీనికంతటికీ కారణం… గత ఎన్నికల్లో ఆఖరికి తనను కూడా గెలిపించకపోవడమే అని జనసైనికులను తిట్టడం మొదలుపెట్టారు!

ఇదే సమయంలో పవన్ శ్రేయోభిలాషి చేగొండి హరిరామ జోగయ్య ఈ సమయంలో పవన్ కు ఒక సూచన చేశారు. టీడీపీతో పొత్తుపెట్టుకునే ఉద్దేశ్యం ఉంటే… ముఖ్యమంత్రి పదవిని చెరిసగం సమయం పంచుకోమని తెలిపారు. రెండున్నరేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే.. మిగిలిన సమయం పవన్ ముఖ్యమంత్రిగా ఉండేలా ప్రతిపాదించమని అన్నారు. అయితే పవన్ ఆనాడు స్పందించలేదు.

అయితే ఇంతలో ఏమి జరిగిందో తెలియదు కానీ… పవన్ మాట మారింది. తాజాగా చేపట్టిన తన వారాహి యాత్రతో అంతా ఊహించినట్లుగ వైసీపీకి కాకుండా… పరోక్షంగా టీడీపీకి షాక్ ఇచ్చారు. తాను సీఎం అభ్యర్థిని అని చెప్పుకుంటున్నారు.. తనకు ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు.. తాను సీఎం గా సరిగ్గా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత తనను రీకాల్ చేయండి అని కూడా అంటున్నారు. దీంతో చంద్రబాబు గొంతులో వెళక్కాయ పడినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు.

2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి మెల్లగా తేరుకున్న చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో గెలిచి తాను సీఎం అయ్యేందుకు పవన్ సహకారం తీసుకోవాలని భావించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ సహకారంతో మెజార్టీ సీట్లు సాధిస్తే అధికారం ఖాయమని చంద్రబాబు ఊహించుకున్నారు. ఆ మేరకు పొత్తులనీ, పలకరింపులనీ అప్పుడప్పుడూ భేటీలయ్యారు. ఆ సమయంలో పవన్ సైతం కొద్ది రోజుల క్రితం వరకూ తాను సీఎం రేసులో లేననే సంకేతాలు ఇచ్చారు.

కానీ… ప్రస్తుత వారాహి యాత్రలో పొత్తుల ప్రస్తావన కానీ, టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలని కానీ పవన్ ప్రస్థావించడం లేదు. చంద్రబాబు పేరే ఎత్తడం లేదు.. పొత్తులో సీట్ల గురించిన అంశాన్నే వదిలేశారు. తనకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇవ్వమని డైరెక్టుగా అడుగుతున్నారు. దీంతో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యిందని కామెంట్ చేస్తున్నారు పరిశీలకులు.

మరి పవన్ ఇలా ఇచ్చిన షాక్ నుంచి చంద్రబాబు తేరుకుంటారా.. తేరుకుని దిగి వస్తారా.. పవన్ తో పొత్తుకు – రెండున్నరేళ్ల సీఎం పోస్టు షేరింగ్ కు ఒప్పుకుంటారా అన్నది వేచి చూడాలి. అయితే… ఇప్పుడు చంద్రబాబుకు అంతకు మించిన ఆప్షన్ లేదని… కచ్చితంగా దిగొస్తారని, పవర్ షేరింగ్ కి అనుకూలంగా తలాడిస్తారని అంటున్నారు విశ్లేషకులు.