విదేశీ ప్రయాణాలు ఎందుకు రద్దు చేసుకున్నారు ?

రెండు ప్రధాన పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ తమ విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. తమ ప్రయాణాలను ఆకస్మికంగా రద్దు చేసుకోవటానికి ప్రధాన కారణం హఠాత్తుగా వేడెక్కిన రాజకీయమనే రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ఐదు రోజుల పర్యటన నిమ్మితం చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో దావోస్ పర్యటనకు వెళ్ళాలి. ఆ పర్యటన ఎప్పుడో ఖారారైంది. చంద్రబాబు అడిగినట్లుగా దావోస్ పర్యటనకు కేంద్రం అంగీకరించకపోతే గొడవపడీ మరి అనుమతులు తీసుకున్నారు. ఈనెల 23వ తేదీ నుండి 28 వరకూ దావోస్ లో ఉండాలి చంద్రబాబు. కానీ తన పర్యటనను మాత్రం చంద్రబాబు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు.

ఇక, జగన్ విషయం చూస్తే గురువారం అంటే జనవరి 17వ తేదీన కుటుంబంతో కలిసి వారం రోజుల పాటు లండన్ కు బయలుదేరాల్సుంది. కానీ జగన్ కూడా అర్ధాంతరంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.  లండన్ పర్యటన రద్దు వెనుక కూడా వేడెక్కిన రాజకీయమే ప్రధాన కారణం. సంక్రాంతి పండుగ పుణ్యమా అంటూ తెలుగురాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఫెడరల్ ఫ్రంట్ లో చేరమని ఆహ్వానిస్తూ చర్చల కోసమని కెటియార్ బృందం జగన్ ను కలవటం, సంక్రాంతి పండుగ పేరుతో తెలంగాణా మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఏపిలో పర్యటించి చంద్రబాబు టార్గెట్ చేయటంతో మంటలు మొదలయ్యాయి.

షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండోవారంలోనే వచ్చేస్తుందని ప్రచారం జరుగుతోంది. నోటిఫికేషన్ ను దృష్టిలో పెట్టుకునే ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ ఇద్దరు రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అభ్యర్ధులపై పూర్తిస్ధాయి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ప్రకటనను చంద్రబాబు రాయలసీమలోని కడప జిల్లా జమ్మలమడుగుతో మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల్లో జమ్మలమడుగులో మాజీ మంత్రి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డే పోటీ చేస్తారని చెప్పేశారు. అదే సందర్భంగా పులివెందులలో మాజీ ఎంఎల్సీ సతీష్ రెడ్డినే అభ్యర్ధికి ఖరారు చేశారు.

ఇక జగన్  పాదయాత్ర మొన్ననే ముగిసింది. పాదయాత్రలో జగన్ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు.  మిగిలిన నియోజకవర్గాలపైన కూడా గట్టిగానే దృష్టి పెట్టి సమీక్షలు చేస్తున్నారు. అదే సమయంలో పాదయాత్రలో మిగిలిపోయిన సుమారు 41 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర ఎప్పుడు చేయాలనే విషయంలో నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కాబట్టి వెడెక్కిన రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు, జగన్ తమ విదేశీ ప్రయాణాలను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారట.