ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు కొత్త పంథాలో నడుస్తున్నాయి! అధికార పార్టీపై విమర్శలు చేయడం ఎంత ముఖ్యమో.. తోటి విపక్ష పార్టీలకు హింట్స్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమనే సరికొత్త పంథాలో సాగుతునాయి. ఈ విషయంలో అటు జనసేన అధినేత పవన్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు… తగ్గేదే లే అంటూ ముందుకు పోతున్నారు!
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా అంటే… రెండు పార్టీల నుంచీ కచ్చితమైన సమాధానం రాదు. కానీ… ప్రేమలేఖలు, కనుసైగలు, ఫ్లైయ్యింగ్ కిస్ లు రొటీన్ గానే సాగుతుంటుంటాయి! అయితే నాలుగైదు రోజుల నుంచి ఈ ఫ్లైయ్యింగ్ కిస్సుల స్థానంలో బల ప్రదర్శన మాటలు తెరపైకి వస్తున్నాయి. నేను ఎక్కువంటే నేను ఎక్కువ అనే స్థాయి రాజకీయాలు నడుస్తున్నాయి.
వారాహి యాత్రకు ముందు వరకూ పరోక్షంగా చంద్రబాబు భజనలో ఉండేవారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! పైగా తనను తాను తగ్గించుకుంటూ.. జనసైనికుల సామర్థ్యాన్ని తక్కువ చేస్తూ… ఈసారి ఒంటరిగా వెళ్తే వీరమరణమే అంటూ, తనకు అంత ధైర్యం లేదని చెప్పేవారు. అయితే గతంలో జనసేన ఘోర ఓటమికి కారణం.. జనసైనికుల సామార్థ్య లోపం కాదు.. జనసేనాని అతితెలివి రాజకీయాల ఫలితం అని గ్రహించలేకపోతున్నారు!
అయితే గతకొన్నిరోజులుగా వారాహియాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు.. చంద్రబాబుని విమర్శించకపోయినా.. తనను ముఖ్యమంత్రిని చేయమని అభ్యర్థిస్తున్నారు. తానే ముఖ్యమంత్రిని అని కూడా చెప్పేస్తున్నారు. ఈ దిశగానే జనసైనికులు పనిచేయాలని, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీతో… టీడీపీ నేతలు షాక్ అవ్వగా.. చంద్రబాబు డబుల్ షాకయ్యారనే కథనాలు మొదలైపోయాయి.
దీంతో… పవన్ కల్యాణ్ కే అంత ఉంటే… తనకు ఇంకెంత ఉండాలి అనుకున్నారో.. లేక, పవన్ కల్యాణ్ కు తనవైపు నుంచి షాకివ్వాలై తలచారో తెలియదు కానీ… రాబోయే ఎన్నికల్లో టీడీపీని 175 నియోజకవర్గాల్లోనూ గెలిపించాలని కోరుతున్నారు! అవును… అన్ని విషయాల్లోనూ జగన్ ని కాపీకొడుతున్నారనే పేరు సంపాదించుకున్న చంద్రబాబు… ఈ విషయంలో మాత్రం ఎందుకు తగ్గాలని అనుకున్నారో ఏమో కానీ… తాను కూడా వైనాట్ 175 అనేశారు!
తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో మైకందుకున్న టీడీపీ అధినేత… మొత్తానికి మొత్తం 175 సీట్లను మనమే గెలవాలంటూ నేతలకు పిలుపునిచ్చారు. ఇందులో రెండవ మాటకు తావు లేదు అంటూ గట్టిగా సౌండ్ చేస్తున్నారు. దీంతో పుత్తుల పంచాయతీ సంగతి కాసేపు పక్కకెళ్లి… పొత్తు విషయంలో ఎక్కువ సీట్ల కోసం అతిచేస్తే… తాను ఎంతకైనా తెగిస్తానన్నట్లుగా చంద్రబాబు.. పవన్ కు షాకిచ్చినంత పనిచేశారని అంటున్నారు పరిశీలకులు.
మరి పవన్ ఇస్తున్న షాకులను మూడు రోజుల పాటు భరించిన చంద్రబాబు ఇలా తాను కూడా రివర్స్ అటాక్ ఇవ్వడంతో… పవన్ నెక్స్ట్ సభలోని ప్రసంగంలో తగ్గుతారా.. లేక, తన పంథాను కంటిన్యూ చేస్తే అవసరమైతే చంద్రబాబే తన కాళ్ల దగ్గరకు వస్తాడన్నట్లుగా పౌరుషంగా ఉంటారా అన్నది వేచి చూడాలి!