అబ్బా… ఓపెన్ అయిపోయారు: చంద్రబాబు సెల్ఫ్ గోల్!

లైఫ్ అండ్ డెత్ సిట్యువేషన్ వచ్చినప్పుడు ఓపెన్ అయిపోవడం బెటర్.. కనీసం ఎంతో కొంత ఫలితం ఉంటుంది. వ్రతం చెడ్డా ఫలితం ఎంతో కొంత దక్కుతుందని భావించారో.. లేక, మరో ఆప్షన్ లేక తెగించారో తెలియదు కానీ… తాజాగా చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు! అయితే ఇది కచ్చితంగా లాస్ట్ ఆప్షనే అని అంటున్నారు పరిశీలకులు.

రాజకీయ నాయకులు – మీడియా ప్రతినిధులు రాసుకోని ఒప్పందం ఒకటి ఉంటుందని అంటుంటారు. ఇందులో భాగంగా ఫలానా మీడియా ఫలానా పార్టీకి అనుకూలం, వ్యతిరేకం అనే విషయాలు బహిరంగ పరచడం ప్రజాస్వామ్యంలో శ్రేయస్కరం కాదని చెబుతుంటారు. అయితే ఆ విషయాన్ని రామోజీ రావు ఎప్పుడో విస్మరించారు. నాటి నుంచి నాలుగో స్థంబానికి చెదపట్టడం ప్రారంభమైంది!

అయితే విమర్శించే విషయంలో కొన్ని మీడియా సంస్థల పేర్లు చెబుతున్నారు కానీ… వెనకేసు కొచ్చే విషయంలో ఏ రాజకీయ నాయకుడూ ఆ పని చేయడం లేదు. ఫలితంగా… ఆ మాటల వల్ల అటు మీడియా సంస్థకు – ఇటు ఆ పార్టీకీ.. రెండింటికీ నష్టం! ఈ విషయాన్ని మరిచిన చంద్రబాబు తాజాగా మరింతగా ఓపెన్ అయిపోయారు. ఇందులో భాగంగా మార్గదర్శిపై మరింత ఓపెన్ గా స్పందించేశారు.

అవును… మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ కేసులు పెడుతుంటే.. విచారణ చేస్తుంటే.. ఆ విచారణకు అక్రమాలు వెలుగులోకి వస్తుంటే.. బాధితులు మీడియా ముందుకు వచ్చి వారి గోడు వెల్లగక్కుతుంటే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే.. మరో పక్క, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా రామోజీ రావు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతుంటే… చంద్రబాబు లైన్ లోకి వచ్చారు.

సీఐడీ అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చి, డేటు – టైం చెప్పి ఏపీలోని ఆఫీసుకు రమ్మంటే… తప్పించుకుని తిరుగుతున్నారు రామోజీ, ఆయన కోడలు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మార్గదర్శిలో అక్రమాలు ఆల్ మోస్ట్ కన్ ఫాం… అనే ప్రచారం జనాల్లోకి బలంగా వెళ్తోందంటూ కథనాలొస్తున్న తరుణంలో చంద్రబాబు లైన్ లోకి వచ్చారు!

ఇందులో భాగంగా… రామోజీ లాంటి నిజాయితీపరుడు, చిత్తశుద్ది కలిగిన వ్యక్తి మరొకరు లేరని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అసలు అలాంటి మహోన్నత వ్యక్తిపై జగన్మోహన్ రెడ్డి శాడిజం చూపిస్తున్నట్లు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రామోజీకి వ్యతిరేకంగా జగన్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని ఈ సందర్భంగా జోస్యం కూడా చెప్పారు.

అక్కడితో ఆగని చంద్రబాబు… యుద్ధం జరిగినప్పుడు చెడుపై మంచే అంతిమ విజయం సాధిస్తుందని చెప్పే సాహసం చేశారు. ఒకవైపు చట్టాలను, నిబంధలను రామోజీ ఉల్లంఘించి మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తున్నట్లు ఆధారాలతో సహా సీఐడీ చూపిస్తుంటే… చెడుపై మంచి గెలుస్తుందని చంద్రబాబు చెప్పడం వెనుక మరో పరమార్ధం ఏమైనా ఉందా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి!

రామోజీ చేస్తున్న వ్యాపారంలో లొసుగులను, మోసాలను, అక్రమాలను సీఐడీ ఆధారాలతో సహా బయటపెడుతున్నా చంద్రబాబు మాత్రం రామోజీ నిష్కళంకుడే అని పదేపదే చెబుతున్నారు. ఇది ఆయన ఆత్యహత్యా సదృశ్యం అని కొంతమంది అంటుంటే… చంద్రబాబు బలమంతా ఎల్లో మీడియానే కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పదు కదా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏది ఏమైనా… ఒకపక్క వ్యవహారం సీఐడి – కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ విషయాలపై మౌనంగా ఉండి ఉంటే సరిపోయేది. రేపు రామోజీ అక్రమాలు చేశారని తెలిస్తే… సైలంట్ గా ఉండొచ్చు! సర్కార్ పెట్టిన కేసులు తప్పుడువి అని తేలితే ఇంక చెప్పేదేముంది… మైకులందుకోవచ్చు. అలా కాకుండా… పరిస్థితి ఇంత స్పష్టంగా ఉన్న సమయంలో రామోజీ అంత గొప్ప వ్యక్తి లేడన్నట్లుగా వ్యాఖ్యానించడం వల్ల… చంద్రబాబు వ్యక్తిగతంగా నష్టం చేకూర్చుకున్నారనే మాటలు వినిపిస్తుండటం గమనార్హం.