ఒక్కసారి గతానికి వెళ్తే… “టీడీపీ – బీజేపీల కలయిక రాష్ట్రానికి చాలా అవసరం. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ముఖ్యం.. ఏపీలో తాను అధికారంలోకి రావడం అంతకంటే ముఖ్యం. అక్కడ మోడీ – ఇక్కడ బాబు… అధికారంలోకి వస్తే… ఇక ఏపీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. అభివృద్ధి దిశగా అడుగులు కాదు.. పరుగులే పెట్టేస్తాము.. ప్రత్యేక హోదాతో పాటు, విశాఖ రైల్వే జోన్ కూడా అవలీలగా తెచ్చేసుకుంటాము..” అంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏపీ వాసులకు హామీ ఇచ్చారు!
నాడు జనసేన అధినేత కూడా… “మీకెందుకు మీరు ఓటెయ్యండి.. నేను ప్రశ్నిస్తాను” అని నమ్మించారు!
ఏపీ వాసులు ఓటేశారు.. ఫలితం చూశారు. ఈలోపు కాలం గడిచింది.. హామీలేమీ అమలుకాలేదు.. పనులేమీ ముందుకు జరగలేదు! అప్పటికి వరకూ రాసుకుపూసుకు తిరిగిన బాబు… హోదా వద్దు ప్యాకేజీ ముద్దని మోడీతో ఏకీభవించారు. హోదాపై ప్రశ్నించినవారిపై విసురుకున్నారు.. అడిగినవారిపై కసురుకున్నారు. హోదాతో ఏమొస్తుందని ఎదురు ప్రశ్నించారు. మరోపక్క… మోడీని అంతలా నమ్మితే తమను వంచించారంటూ మైకందుకున్నారు.
ఈ సందట్లో సడేమియాలాగా… ఏపీకి రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ… పవన్ రోడెక్కారు! “నమ్మింది మీరు.. నమ్మించింది మీరు.. ఇచ్చింది ఇచ్చినట్లు పుచ్చుకుంది మీరు.. మళ్లీ ఏమిటి ఈ డ్రామాలు” అని ప్రజలు నాడు ప్రశ్నించలేకపోయారు. అనంతరం… 2019 ఫలితాల్లో చంద్రబాబు – పవన్ కల్యాణ్ లను కాస్త గట్టిగానే ప్రశ్నించారు.
కాలం గడిచింది… మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో… మరోసారి బీజేపీ – టీడీపీ కలవడం అవసరం అని చంద్రబాబు మైకందుకున్నారు. తాను, మోడీ ఒకేలా ఆలోచిస్తామని, అభివృద్ధిలో ఇద్దరి ఆలోచనా సరళి ఒకేళా ఉంటుందని చెబుతున్నారు. “మోడీతో కలిసి పనిచేయడానికి తానెప్పుడూ సిద్ధమే” అని తేల్చి చెప్పారు. బాబు రాజకీయాల గురించి, వంచనలో ఆయన స్థాయిని గురించి కాసేపు పక్కనపెడితే… దీంతో ఏపీ ప్రజలకు కొత్త అనుమానం మొదలైంది!
ఒకసారి వర్తమానంలోకి వస్తే… తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్లలో బీజేపీ భారీ సభ జరిగింది. ఈ సభలో మైకందుకున్న అమిత్ షా… బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తామని తేల్చి చెప్పారు. దీనిపై పలువిమర్శలు వెళ్లివెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… ఏపీలో చంద్రబాబు కూడా బీజేపీతో కలిసి ప్రయాణించడానికి తాను సిద్ధమని ప్రకటించారు.
ఒకవేళ అదే జరిగి బాబుకు గత్యంతరం లేకో… లేక, బీజేపీకి ఆత్మాభిమానంలేకో… మరోసారి టీడీపీ – బీజేపీ లు ఏపీలో కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తే… ఏపీలో కూడా ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తారా? తెలంగాణలో ఒకమాటా.. ఏపీలో ఒకమాట బీజేపీ నేతలు చెప్పబోతున్నారా? గతంలో చంద్రబాబు ఉపయోగించి.. తెలంగాణలో అడ్రస్ లేకుండాపోయిన “రెండు కళ్ల” సిద్ధాంతం ఇక్కడ అమలు చేయబోతున్నారా?
తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్స్ ఎత్తేస్తారు కానీ… ఏపీలో తానున్నంతకాలం అలా జరగనివ్వనని బాబు హామీ ఇస్తారా? తీరా ఏపీలో కూడా బీజేపీ ఆ పనిచేస్తే… అప్పుడు మోడీని విమర్శించి, తాను సైడ్ అయిపోయి.. మొడీని తిడుతూ ఏపీ ప్రజలను మరోసారి వెర్రివాళ్లను చేస్తారా? చంద్రబాబే చెప్పాలి!!