ఏమిటీ హామీలు… చంద్రబాబుకు ఏమైంది?

రాబోయే ఎన్నికలు టీడీపీకి, చంద్రబాబుకి డూ ఆర్ డై సిట్యువేషన్ ని కల్పిస్తున్నాయనేది తెలిసిన విషయమే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే… ఇక చరిత్ర పుటల్లో కలిసిపోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదనేది తెలిసిన విషయమే! ఈ పరిస్థితుల్లో గెలుపు అనివార్యం అయిన నేపథ్యంలో హామీల విషయంలో శృతిమించిపోతున్నారు చంద్రబాబు!

ఏమి చేసైనా.. ఎలా చేసైనా.. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిందే అని గట్టి పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో ఓడిపోతే జరిగేదేమిటో అందరికంటే ఆయనకే బాగా తెలుసు! ఈ సమయంలో తన గత పాలనను తిరిగి తెస్తానని చెప్పుకునే పరిస్థితి లేని చంద్రబాబు… ఉచితాలనూ, మాఫీలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.

సాధారణంగా 40ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ.. సుమారు 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు… మరోసారి సీఎం పీఠం అదిరోహించాలని చూస్తున్నారు. అలా అని తాను గతంలో చేసిన సుపరిపాలన, నాడు అందించిన పథకాల టాపిక్ మాత్రం ఎత్తలేరు. అది బాబు పరిస్థితి!

ఈ క్రమంలో తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే నాలుగో సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. మహానాడులో భాగంగా విడుదల చేసిన మినీ మహానాడులో… ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు… తాజాగా నాలుగో సిలిండర్ కూడా ఫ్రీ అనేశారు.

2014 ఎన్నికల్లో రుణమాఫీ అని, నిరుద్యోగ భృతి అని పలురకాల హామీలిచ్చిన చంద్రబాబు… అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమిటనేది అందరికీ తెలిసిందే. దాని ఫలితం 2019 ఎన్నికల్లో పరిపూర్ణంగా చూశారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రజలను ఏమార్చే ఉద్దేశ్యమో.. లేక, ప్రజలకు అంత జ్ఞాపకశక్తి ఉండదులే అనే నమ్మకమో తెలియదు కానీ… మరోసారి ఊకదంపుడుగా హామీలు ఇచ్చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే… తల్లికి వందనం స్కీంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఏడాదికి తలా రూ.15 వేలు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు.. రైతులకు ఏడాదికి రూ.20 వేలు.. ఇప్పుడు తాజాగా ఏడాదికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్లు అని ప్రకటించారు. దీంతో పెదవి విరుస్తున్నారు పరిశీలకులు.

జగన్ ఉచిత హామీలు ఇస్తున్నాడని.. దాదాపు నవరత్నాలు అన్నింటిమీదా విమర్శలు చేసిన చంద్రబాబు… జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ శ్రీలంకలాగ అయిపోతోందని గోల చేశారు. అయితే ఆ గోల సంగతి ఏమో కానీ… చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం ఏపీ నిజంగానే శ్రీలంక అయిపోతుందేమో అన్న అనుమానాలు ఈ హామీలను చూసిన తర్వాత అనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!