కష్టపడిన వారికంటూ.. గోడదూకిన వారికా బాబు?

చినబాబు లోకేష్ పాదయాత్ర చేస్తున్నా కూడా.. పూర్తిగా ఆ యాత్రపైనా, ఆయనపైనా ఆదారపడే సాహసం చేయలేని చంద్రబాబు.. తానే కష్టపడి ఏపీలో తిరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో.. తమ్ముళ్ల ఫెర్మార్మెన్స్ పై రిపోర్టులు తెచ్చుకుంటున్న బాబు.. పరిస్థితి గమనించి పాత పాటలే మళ్లీ పాడుతున్నారు!

టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ చేపట్టిన “బాదుడే బాదుడు”, “ఇదేమి ఖర్మ రాష్ట్రానికి” కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్యకర్తలు, నాయకులు ఎవరెవరి ఫెర్మార్మెన్స్ ఎలా ఉందన్న విషయంపై సర్వే చేయించుకోవడంతో పాటు.. వారికి రేటింగ్స్ కూడా ఇస్తున్నారు! ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లలలోని తమ్ముళ్ల ఫెర్మార్మెన్స్ బాబుని చాలా నిరాశకు గురిచేస్తుందంట!

దీంతో టెన్షన్ పడిన బాబు… దీని మీద ఉత్తరాంధ్రా ప్రాంతీయ సదస్సును త్వరలో నిర్వహించి పార్టీలో పనితీరును మెరుగుపరచుకోవాలని తమ్ముళ్లకు గట్టిగా సూచనలు చేయనున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర తమ్ముళ్లలో ఉత్సాహం లేకపోవడానికి గల కారణం మూడు రాజధానుల ఎఫెక్టేమో అనే ఆలోచనలో కూడా ఉన్నారంట బాబు!

అంతవరకూ బాగానే ఉంది కానీ… కేడర్ ను ఉత్సాహపరిచేందుకు “పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తాము” అని మళ్లీ పాతపాటే పాడుతున్నారంట. దీంతో… మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను ఏమి చేస్తారు అని వెంటనే ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారంట తమ్ముళ్లు!

ఇంతకాలం కష్టపడినవారిని కాదని, కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి బాబు పెద్ద పీట వేస్తున్నారని తమ్ముళ్లు కామెంట్ చేస్తున్నారంట. ప్రతిపక్షంలో ఉన్న ప్రతీసారీ తాము కష్టపడటం.. సరిగ్గా ఎన్నికల సమయానికి జంపింగ్ జఫాంగులకు సీట్లు కట్టబెట్టడం.. షరా మామూలు అయిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారంట.

మరి బాబు ఇలా ఫీలవుతున్న తమ్ముళ్లకు ఏమి చెబుతారు.. జంపింగులకు ఏమి చెబుతారనేది వేచి చూడాలి!!