మంగళగిరి:ఈ రోజు పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి సోము వీర్రాజు మద్దతిస్తున్నారని కానీ జగన్ మాత్రం ఎందుకు నియంతలాగ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు .
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని…. ఎవరూ రాజధానిని మార్చలేరని తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. దీంతో ఏపీలో రాజధాని మీద రాజకీయ వేడి రాజుకుంది. టీడీపీ ఇప్పుడు దీన్ని ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్లాలని యోచిస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీని అడ్డంపెట్టుకుని జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తుంటే సీఎం జగన్ మాత్రం మూడు రాజధానులంటూ మూర్ఖత్వంగా ముందుకు వెళ్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏడాది కాలంగా అమరావతి కోసం రైతులు, మహిళలు పోరాడుతున్నారని, ప్రభుత్వం కనీసం వారి వైపు చూడట్లేదని విమర్శించారు. బీజేపీ పార్టీ కూడా అమరావతికి అనుకూలమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కూడా రాజధాని అమరావతికి సుముఖంగా ఉన్నప్పుడు జగన్ కు అంత పట్టుదల ఎందుకని ఆయన నిలదీశారు.దీంతో సోము వీర్రాజు వ్యాఖ్యలను అడ్డంపెట్టుకుని చంద్రబాబు ఏకంగా జగన్ ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ది పొందడానికి ప్రత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.