ఈ మడత కబుర్లు మానవా బాబు?

చంద్రబాబు చెప్పే మాటలకూ, చేసే చేతలకూ ఏమత్రం సంబంధం ఉండదని చెబుతుంటారు.. ఆయనను బాగా అబ్జర్వ్ చేసినవారు, బాగా అర్ధం చేసుకున్నవారు! బాబు కూడా నిత్యం వారి మాటలకు బలం చేకూర్చేలానే ప్రవర్తిస్తుంటారు. ఇందులో భాగంగా… తాజాగా ఒక బలమైన స్టేట్ మెంట్ ఇచ్చారు బాబు. ఇది చాలా సార్లు చెప్పడం – ఆనాకా అమలుచేయకపోవడం తెలిసిన సంగతే అయినా.. తమ్ముళ్ల జ్ఞాపకశక్తిపై బలమైన అభిప్రాయం ఉన్న బాబు.. మరోసారి చెబుతున్నారు.

తాజాగా పోలిట్ బ్యూరో సమావేశంలో స్పందించిన బాబు… ఈసారి యువతకు 40శాతం సీట్లు అని ప్రకటించారు. అంతేకాదు.. పార్టీకోసం కష్టపడినవారికే సీట్లు అంటూ తేల్చేశారు. దీంతో… ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక… మౌనాన్నే తమ బాషగా చేసుకుని జుట్టుపీక్కుంటున్నారంట సీనియర్లు! ఉన్న 175స్థానాల్లో 40శాతం.. అంటే.. సుమారు 70సీట్లు యువతకు ఇచ్చేయాలి! ఇది జరిగేపనేనా? మరోపక్క… పార్టీకోసం కష్టపడినవారికే సీట్లు అంటే… ఇంతకాలం సత్తెనపల్లిలో కోడెల కుమారుడు కష్టపడి పనిచేశారు… మరి ఇప్పుడు ఆయనను కాదని కన్నా లక్ష్మీనారాయణను తెచ్చిపెట్టారు? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుండటంతో… సైలంటుగా ఉంటున్నారట సీనియర్లు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు… యువకుడు. పైగా పార్టీకోసం గత నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు. మరి ఆయనకు సీటేది చంద్రబాబు అంటే… సమాధానం? అంటే… కోడెల కుమారుడికి బాబు చెప్పిన రెండు రిజర్వేషన్లూ ఉన్నా కూడా… పనవ్వడంలేదన్నమాట! ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. తవ్వుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో, మరెన్నో.. ఇంకెన్నో.. అంటున్నారు సీనియర్లు! ఇవన్నీ తెలిసి కూడా బాబు ఎలా వాగ్ధానం చేశ్తారని ఫీలవుతున్నారంట.

ఓవైపు ఆపార్టీ నుంచీ ఈ పార్టీ నుంచి వస్తున్న వారి చేరికలతో పార్టీ బలం పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు… మరోవైపు పార్టీలో కష్టపడినవారికే ప్రాధాన్యముంటుందని చెబుతున్నారు… ఇంతకీ చంద్రబాబు లాజిక్ ఏంటి..? మరోపక్క సీనియర్లు తమ అనుభవాన్ని ఉపయోగించి ఈసారి అధికారంలోకి రావడానికి కృషి చేయాలంటున్నారు.. యాక్టివ్ అవ్వాలని సూచిస్తున్నారు.. మరోవైపు… యువతకు 40శాతం సీట్లు ఇస్తామంటున్నారు. చంద్రబాబును ఖాతరు చేసే అలవాటు లేనివారు, తెలుగుదేశం పార్టీలో ఆయన కంటె సీనియర్ నాయకులు పలువురు ఉన్నారు. వాళ్లు గట్టిగా తమకు టికెట్ కావాల్సిందేనని పట్టుబడితే ఆయన ఏం చేస్తారు? తాము చెప్పినవారికి కూడా టిక్కెట్లు ఇవ్వాలని గతంలోలా అడిగితే ఏమి చెప్తారు?

ప్రస్తుతం టీడీపీలో పోలిట్ బ్యూరో మీటింగ్ పేరుచెప్పి బాబు పెట్టిన తికమక వ్యవహారం ఇది. యువత అంటే… ఇప్పటికే సీనియర్స్ అయిపోయిన వారి వారసులేనా? కష్టపడినవారంటే… ఇంతకాలం బాబుని పార్టీని తిట్టి – కొత్తగా పార్టీలోకివచ్చిన కన్నాలాంటి వారేనా? బాబుకే తెలియాలి – తమ్ముళ్లు గ్రహించుకోవాలి!