దేవినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రాజెక్టుల వ్యయాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ వివరాలు సేకరిస్తోందట. చంద్రబాబునాయుడు హయాంలో దేవినేని జలవనరుల శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగిరి, హంద్రీ-నీవా లాంటి అనేక ప్రాజెక్టులను మంత్రి హోదాలో ఆయనే పర్యవేక్షించారు.

అదే సమయంలో ప్రాజెక్టులపై విపరీతమైన అవినీతి ఆరోపణలు ముసురుకొన్న విషయం తెలిసిందే. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా రాని అవినీతి ఆరోపణలు చంద్రబాబు హయాంలో పెరిగిపోయాయి. దానికితోడు ప్రాజెక్టుల వ్యయాలపై విచారణ జరిపిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా భారీగా అవినీతి జరిగిందని తేల్చి చెప్పింది.

అయితే అప్పట్లో శాసనసభలో బలంతో పాటు కేంద్రం మద్దతు కూడా ఉండటంతో ప్రతిపక్షాల డిమాండ్లను, ఆరోపణలను చంద్రబాబు ఏమాత్రం లెక్కచేయలేదు. ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన తర్వాత ప్రాజెక్టులపై బిజెపి నేతలు కూడా ఆరోపణలు మొదలుపెట్టినా పట్టించుకోలేదు.

సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టలకు సంబంధించిన అసలు వ్యయాలు, పెరిగిన అంచనాలు, అవినీతి తదితరాలపై దృష్టిపెట్టి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.  ఎలాగూ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై జగన్ కూడా సమీక్షలు చేస్తున్నారు కద. అందుకే ధైర్యంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా అవినీతిపై ఆరాలు తీస్తోంది. మొత్తం మీద దేవినేని చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.