చంద్రబాబునాయుడు చుట్టూ కాంగ్రెస్ ఉచ్చుపన్నిందా ? ఆ ఉచ్చులో నుండి చంద్రబాబు ఇక బయటపడలేరా ? కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. గుంటూరులో బిజెపి రాష్ట్ర కార్యాలయం శంకుస్ధాపనకు వచ్చిన సందర్భంగా రాజ్ నాధ్ మాట్లాడుతూ, చంద్రబాబు చుట్టూ కాంగ్రెస్ పెద్ద ఉచ్చు పన్నినట్లు రాజ్ నాధ్ ఎద్దేవా చేశారు. ఉచ్చులో నుండి బయటపడటం చంద్రబాబుకు సాధ్యం కాదని కూడా అన్నారు.
రాజ్ నాధ్ మాటలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటమే రాజ్ నాధ్ సింగ్ మాటలు యదార్ధమని చెప్పటానికి నిదర్శనం. ఎలాగంటే, తెలుగుదేశంపార్టీ పుట్టుకే కాంగ్రెస్ కు వ్యతరేకంగా జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి పార్టీతో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారంటే అర్ధమేంటి ? సరే, పొత్తులు పెట్టుకోవటంలో కాంగ్రెస్, చంద్రబాబు ఎవరి ప్లాన్ వాళ్ళకుండచ్చు. కానీ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవటాన్నే చాలామంది జీర్ణించుకోలేకున్నారు. పొత్తుల వల్ల అంతిమంగా లాభపడేదెవరు ? నష్టపోయేదెవరన్నది కాలమే చెబుతుందనుకోండి అది వేరే సంగతి.
అదే విషయాన్ని రాజ్ నాధ్ ప్రస్తావించారు. కాకపోతే చంద్రబాబు కోసం కాంగ్రెస్ పన్నిన ఉచ్చు ఏంటనే విషయం మాత్రం చెప్పలేదు. అయినా పొత్తులు పెట్టుకోవటం, విడిపోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం హోం మంత్రికి కూడా బాగా తెలిసే ఉంటుంది. బిజెపికి చంద్రబాబు శాస్వతమిత్రుడని స్వయంగా హోం మంత్రే పార్లమెంటు సాక్షిగా చెప్పారు. కాకపోతే అవసరానికి రెండుసార్లు వాడుకుని లబ్దిపొంది అవసరం తీరిపోగానే తమను వదిలించుకున్నారన్న మంటే రాజ్ నాధ్ లో కనబడుతోంది.