అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి చంద్రబాబునాయుడుకు చిరకాల మిత్రుడు, కేంద్ర హోం శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ పెద్ద షాకే ఇచ్చారు. ఇంతకీ ఆ షాక్ ఏమిటనుకుంటున్నారా ? అదేనండి అసెంబ్లీ సీట్ల పెంపుపైన. జనాభా లెక్కల ప్రకారం 2026 వరకూ నియోజకవర్గాల సంఖ్యను పెంచటం సాధ్యం కాదంటూ తాజాగా హోంశాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అసెంబ్లీ సీట్లను పెంచుకునే విషయంలోనే బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్డీఏలో ఉన్నపుడే కాదు బయటకు వచ్చేసిన తర్వాత కూడా చంద్రబాబు సీట్ల పెంపు విషయాన్నే కలవరిస్తున్నారు.
అందుకే ఫిరాయింపులకు ప్రోత్సాహం
2019 ఎన్నికలకు అసెంబ్లీ స్ధానాలు పెరుగుతాయన్న ధీమాతోనే విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను రకరకాల ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నారు. అలా లాక్కున్న వాళ్ళల్లో అత్యధికులకు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిక్కెట్లు ఇచ్చే హామి మీదనే వారంతా పార్టీ ఫిరాయించారన్న విషయం బహిరంగమే.
సీట్ల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి
ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో సీట్లను పెంచకపోవటం కూడా ఒకటి. ప్రత్యేకహోదాపైనే తాను ఢిల్లీకి 29 సార్లు వెళ్ళానని ఎన్ని మార్లు చెప్పుకున్నా నమ్మేవాళ్ళు లేరు. అదే విషయాన్ని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అండ్ కో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళలేదని ఎప్పుడెళ్ళినా సీట్ల పెంపు విషయంతో పాటు జగన్మోహన్ రెడ్డి కేసుల గురించిమాట్లాడేందుకే వెళ్ళినట్లు చెప్పి చంద్రబాబు గాలితీసేశారు.
ఎన్డీఏలో నుండి వచ్చేయటానికి అదీ ఓ కారణమే
సరే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో చంద్రబాబు బాగా పట్టిన విషయం స్పష్టం. అదిసాధ్యం కాదని అర్దమైన తర్వాతే ఎన్డీఏలో ఉండాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తింది. అప్పటికే ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ రాదన్న విషయం అందరికీ అర్ధమైంది. దానికితోడు సీట్ల పెంపు కూడా సాధ్యం కాదని తేలిపోవటంతోనే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారన్నది బహిరంగ రహస్యం.
ఆందోళనలో ఫిరాయింపులు
ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా సీట్లు పెంచే విషయంలో పార్లమెంటులో తన ఎంపిలతో అడిగించటంతో పాటు తాను నేరుగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అందుకే తాజాగా హోం శాఖమంత్రి రాజ్ నాథ్ బెంగుళూరులో మాట్లాడుతూ చంద్రబాబు అడిగినట్లుగా సీట్ల పెంపు సాధ్యం కాదన్నారు. ఇప్పటికిప్పుడు సీట్ల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగంలోని 171వ అధికరణంలోని 3వ నిబంధన సవరించాలన్నారు. అది సాధ్యం కాదు కాబట్టే జనాభా లెక్కల ప్రకారం 2026 లో మాత్రమే అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి తాజా ప్రకటనతో ఫిరాయింపుల్లో ఆందోళన మొదలైంది. మరి ఫిరాయింపుల్లో ఎంతమందికి టిక్కెట్లిస్తారో ? ఎంతమందికి మొండిచెయ్యి చూపుతారో చంద్రబాబుకే తెలియాలి