కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో దాగుడుమూతలు ఆడుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా నుండి పోలవరం, రాజధాని విషయం అనేక అంశాల్లో ద్వంద వైఖరిని అవలంబిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒకటి చెబితే రాష్ట్ర శాఖ ఇంకొకటి చెబుతుంది. హోదా కాదు ప్యాకేజీ ఇస్తామంటారు. కానీ ఎప్పుడిస్తారో చెప్పరు. పోలవరం అంచనా వ్యయం తగ్గించేస్తారు, అదేమిటని రాష్ట్ర శాఖను ప్రశ్నిస్తే కేంద్రంలో మాత్రమేనని బడాయిలు చెబుతారు తప్ప నిధుల సంగతి తేల్చారు. ఇక మూడు రాజధానుల విషయంలో అయితే జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కారును అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కానీ రాజధాని అనేది రాష్ట్రంపరిధిలోని అంశమని, అందులో జోక్యం చేసుకోలేమని అన్నారు.
అలాంటప్పుడు రాష్ట్ర శాఖ అమరావతికి కట్టుబడి ఉన్నామని చెబితే ఎలా నమ్మేది. సోము వీర్రాజుగారు మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుండి తరలించే ప్రసక్తే లేదని, మోదీ ప్రతినిధిగా చెబుతున్నా రాజధాని అమరావతే అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనాడు వ్యతిరేకిస్తున్న ఆయన గతంలో మూడు కాదు ప్రతి జిల్లాను రాజధానిగా మార్చేస్తాం అన్నారు. ఇలా పరిస్థితిని బట్టి డెసిషన్లు మార్చుకుంటూ ప్రజల్నే కాదు ఇతర పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కమలనాథులు. ఇది జగన్ కు సైతం తలనొప్పిగానే పరిణమించింది. బీజేపీతో సఖ్యతగా ఉండాలని ఆయన రాష్ట్ర శాఖ తీరుతో చికాకుపడుతున్నారు.
ఇలాంటి తరుణంలోనే కర్నూలులో హైకోర్టు నిర్మాణం వివాదంగా మారుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా జగన్ కర్నూలులో హైకోర్టును కట్టి న్యాయరాజధానిని చేస్తానని అన్నారు. బీజేపీ కూడ ఈ నిర్ణయాన్ని గతంలో స్వాగతించింది. అయితే హైకోర్టు మార్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. అందుకు రాష్ట్రపతి అనుమతులు కావాలి. అందుకు పూనుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ రాష్ట్ర బీజేపీ మాట మార్చేసి మూడు రాజధానులకు వ్యతిరేకమని, ఇది మోదీ మాటన్నట్టు మాట్లాడారు. పైగా ఇంతవరకు హైకోర్టు తరలింపు ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. దీంతో జగన్ ఆలోచనలో పడ్డారు.
ఇక వీరితో నేరుగా వ్యవహరిస్తే కుదరదనుకున్నారో ఏమో కానీ రివర్స్ స్ట్రాటజీ మొదలుపెట్టారు. హైకోర్టు తరలింపు ప్రక్రియను ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేయించాలనుకున్న ఆయన బీజేపీని మింగలేని కక్కలేని ఇరకాటంలో పెట్టేశారు. బీజేపీ గతంలో మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అనే అంశాన్ని ఉంచారు. దాన్నే పట్టుకున్న జగన్ అమిత్ షాతో మీరు అనుకున్న, మేనిఫెస్టోలో పెట్టిన కర్నూలులో హైకోర్టు అనే అంశాన్ని మేము పూర్తిచేయాలని అనుకుంటున్నాం. మీ సహకారం కావలి. వెంటనే తరలింపు ప్రక్రియ మొదలుపెట్టండి అంటూ అమిత్ షాను కోరారు. నిజమే.. బీజీపీ మేనిఫెస్టోలో కర్నూలు విషయం ఉంది. జగన్ మూడు రాజధానులు, కర్నూలులో హైకోర్టు అనగానే మద్దతిచ్చి మేం చేయాలనుకున్నది జగన్ చేస్తున్నారు అంటూ తమ విజన్ గురించి గొప్పగా చెప్పుకుంది.
అందుకే జగన్ తెలివిగా ఆ విషయాన్నే ప్రస్తావించి మీరు చేయాలనుకున్నదే.. మేం చేస్తున్నాము అంతే. జరిపించండి అంటూ చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఈ సంగతి అమిత్ షాకు కూడ తెలుసు. కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే జగన్ మాట్లాడిందంతా నిజం కాబట్టి. అందుకే కాదనలేక, సాకులు చెప్పలేక తలూపారు. మరి తలూపింది ప్రకారం త్వరలో తరలింపు ప్రక్రియ స్టార్ట్ చేస్తారేమో చూడాలి.