అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్రప్రభుత్వం గనుక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబునాయుడుకు అంతకుమించిన షాక్ మరొటి ఉండదు. అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లను పెంచుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. కాకపోతే వివిధ కారణాలతో చంద్రబాబు ప్రయత్నాలను నరేంద్రమోడి అడ్డుకున్నారు. ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేయటానికి ఇదే ప్రధాన కారణమనే ప్రకారం అందరికీ తెలిసిందే.
జమ్మూ-కాశ్మీర్ విషయంలో అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయంతో సిక్కింతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీట్లను పెంచే విషయాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. నిజంగానే సీట్లు గనుక పెరిగితే చంద్రబాబుకు పెద్ద షాకనే చెప్పాలి. మొన్నటి ఘోర ఓటమి దెబ్బకు చాలామంది నేతలు చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకపోవటంతో పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు.
నిజానికి మొన్నటి ఎన్నికల్లోనే టిడిపి తరపున పోటి చేయటానికి గట్టి అభ్యర్ధులు దొరకలేదు. పోటీ చేసిన వాళ్ళలో చాలామందిపై అవినీతి ఆరోపణలు ఉండటంతో జనాలు టిడిపిని చాపచుట్టి బయటపడేశారు. అందుకే వైసిపి రికార్డుస్ధాయిలో 151 సీట్లలో అఖండ విజయం సాధించింది. ఈ నేపధ్యంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుండి 225కి పెరగటమంటే చంద్రబాబుకు కష్టమనే అనుకోవాలి.
ఒక్కసారిగా 50 మంది గట్టి అభ్యర్ధులను పోటికి నిలబెట్టాలంటే మామూలు విషయం కాదు. సీట్లు పెరిగేంతలోగా ఎంతమంది నేతలు టిడిపికి రాజీనామాలు చేస్తారో తెలీదు. సో సీనియర్లు, గట్టి నేతలనుకున్న వారిలో చాలామంది వెళిపోతే వచ్చే ఎన్నికలకు చంద్రబాబుకు అసలు 225 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరకుతారా అన్నదే ప్రశ్న.